2025 Honda Unicorn Launched:హోండా యూనికార్న్ అభిమానులకు గుడ్‌న్యూస్. దేశీయ మార్కెట్లోకి 2025 మోడల్ హోండా యూనికార్న్ ఎంట్రీ ఇచ్చింది. హోండా టూ-వీలర్స్‌లో యూనికార్న్ మోడల్‌ది ప్రత్యేక స్థానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చిన మోటార్‌సైకిల్స్‌లో ఇది భారీ సేల్స్‌ను సొంతం చేసుకుని అత్యంత విజయవంతమైంది.
ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో 2024 ముగుస్తుండగా.. గత కొన్ని నెలల నుంచి కంపెనీ తన పాత మోడల్స్‌ను అప్డేట్స్ చేస్తూ నయా మోడల్స్‌ను వరుస పెట్టి లాంఛ్ చేస్తోంది. కంపెనీ ఇటీవలే తన అప్డేటెడ్ 'యాక్టివా 125', 'SP 125', 'SP160' బైక్‌లను లాంఛ్ చేసింది. తాజాగా తన '2025 హోండా యూనికార్న్' మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
హోండా మోటార్‌సైకిల్ ఇండియా OBD2B ప్రమాణాలకు అనుగుణంగా దాని ఉత్పత్తులను అప్డేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ కొత్త యునికార్న్‌ను కూడా అదే అప్‌గ్రేడ్స్‌తో తీసుకొచ్చింది. దీనితో పాటు ఈ కొత్త బైక్‌లో చాలా అప్డేట్స్, ఫీచర్లను అందించింది. అయితే అప్డేట్లకు తగినట్లుగానే ఈ నయా యూనికార్న్ ధర కూడా మునుపటి కంటే ఎక్కువగానే ఉంది. కంపెనీ '2025 హోండా యూనికార్న్' బైక్‌ను రూ. 1.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇది ప్రస్తుత మోడల్ కంటే రూ.8,000 ఎక్కువ ఖరీదైనది.
ఈ కొత్త మోడల్ బైక్‌లో ఆల్-LED హెడ్‌లైట్స్‌ను అమర్చారు. అయితే ఈ హైడ్‌లైట్ యూనిట్ డిజైన్, లేఅవుట్ పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ అప్డేటెడ్ డిజిటల్ LCD క్లస్టర్‌తో వస్తోంది. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, 'ఎకో' ఇండికేటర్ వంటి ఫీచర్లను జోడించింది. వీటితోపాటు కంపెనీ ఇప్పుడు ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో 15-వాట్ల USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించింది.
కలర్ ఆప్షన్స్:కంపెనీ ఈ కొత్త 2025 హోండా యూనికార్న్ బైక్‌ను మూడు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.
- పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్
- మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్
- రేడియంట్ రెడ్ మెటాలిక్