YSRCP MLC Duvvada Audio Leak : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్‌లో బెదిరించారు. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు పొక్కడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధినపడ్డ శ్రీనివాస్ ఈ వివాదంతో మరింత ఇరుకునపడ్డారు. దువ్వాడ సన్నిహితురాలు దివ్వల మాధురికి చెందిన తలగాం కూడలిలోని పెట్రోలు బంకు అనుమతులు తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత రిఫైనరీకి చెందిన అధికారిని ఎమ్మెల్సీ ఫోన్‌లో బెదిరించినట్లుగా ఆ ఆడియోలో ఉంది.
Duvvada Threatened Officer in Phone : పోర్టు నిర్మాణానికి రోజుకు 20,000 లీటర్ల ఇంధనం అవసరమవుతుందని, వెంటనే అనుమతులు పునరుద్ధరించాలని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిస్తూ మాట్లాడారు. ఆ బంకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్‌షిప్ కూడా తొలగించామని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ఇప్పుడు పునరుద్ధరించడం సాధ్యం కాదని వివరించారు. దీంతో దువ్వాడకు, ఆయనకు మధ్య మాటామాట పెరిగింది.
ఈ క్రమంలోనే వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. 'పై అధికారులకు చెప్పానని, వాళ్లు చెప్పినా ఎందుకు చేయవని, నేనేమైనా రోడ్డు పక్కన వెళ్లిపోయే వాడిననుకుంటున్నావా అంటూ' శ్రీనివాస్ తీవ్ర స్వరంతో ఆ అధికారిని హెచ్చరిస్తున్నట్లు ఆడియోలో ఉంది. ఇప్పుడు తాజాగా అది బయటకు రావడంతో ఆడియో వైరల్గా మారింది.