ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోడిగుడ్డు' కథల నేత, అవినీతి మేత- ఉమ్మడి విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ మంత్రి - YSRCP Leader Irregularities - YSRCP LEADER IRREGULARITIES

YSRCP Leader Irregularities in Visakha District: ఉమ్మడి విశాఖలో ఆయనో పేరున్న నేత! 'కోడిగుడ్డు' పేరు చెబితే ఠక్కున గుర్తొస్తారు.! అక్రమాల్లో ఆరితేరారు. కబ్జాలు, సెటిల్‌మెంట్లతో చెలరేగిపోయారు. కొండల్ని కొల్లగొట్టి మట్టి, కంకర అమ్మి సొమ్ము చేసుకున్నారు. స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు పిండుకుంటూ బినామీలను ముందు పెట్టి భారీ భూదందాలతో ఆస్తులు కూడబెట్టారు. చివరికి ఓటమి భయంతో పక్క జిల్లాకు వెళ్లారు.

YSRCP_Leader_Irregularities_in_Visakha_District
YSRCP_Leader_Irregularities_in_Visakha_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 10:46 AM IST

ఉమ్మడి విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ మంత్రి

YSRCP Leader Irregularities in Visakha District:ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ ప్రజాప్రతినిధి అక్రమాలతో చెలరేగారు. ఎసైన్డ్, వివాదాస్పద భూముల్ని అక్రమంగా సొంతం చేసుకోవడం, క్వారీల యజమానుల్ని బెదిరించి జేబులు నింపుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కొన్నిరోజుల క్రితం ఈ నాయకుడి జన్మదిన వేడుకల పేరిట క్వారీల యజమానుల నుంచి భారీగా వసూలు చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే బాధితులకు భరోసా ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న ఆ నేత వాటి యాజమాన్యాలను నిబంధనల పేరుతో భయపెట్టి డబ్బులు గుంజేస్తారన్న ఆరోపణలున్నాయి.

విపక్ష నాయకులపైనా, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేవారిపైనా, పత్రికలపైనా నోరు పారేసుకోవడం ద్వారా పార్టీ అధినేతతో శెభాష్‌! అనిపించుకోవాలని తెగ తాపత్రయపడే ఆయనకు సిట్టింగ్‌ సీటు దక్కలేదు. ఐదేళ్లలో ఆయన నిర్వాకాలతో మళ్లీ అక్కడ పోటీ చేస్తే భారీ తేడాతో ఓడిపోతారని సర్వే నివేదికలు తేల్చడంతో పార్టీ అధినేత ఆయన్ను పక్క జిల్లాకు పంపేశారు. ఆ ప్రజాప్రతినిధి రియల్‌ ఎస్టేట్‌ దందాలు, ప్రైవేట్‌ సెటిల్‌మెంట్లు చేసేందుకు అత్యంత విశ్వాసపాత్రులైన ఇద్దరు బాబుల్ని బినామీలుగా పెట్టుకున్నారు.

ఎవరికైనా పాసుపుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యుటేషన్లు జరగాలన్నా ఆ ఇద్దరు బినామీల అనుమతి తప్పరిసరి. పనికి అనుగుణంగా వేలల్లో పిండేస్తారు. కొవిడ్‌ సమయంలో రెవెన్యూ దస్త్రాల్ని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయతీ భూములుగా చూపించి అమ్మేశారన్న ఆరోపణలున్నాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ఇనాం, ఎసైన్డ్‌ భూములపై కన్నేసి సాగులో ఉన్న కొందరితో బేరసారాలు నడిపారు.

వైసీపీ కొనసాగుతున్న షాక్​ల పర్వం- ఫ్యాన్​ను వీడి సైకిల్ ఎక్కుతున్న నేతలు - YSRCP Leaders Join In To TDP

జగనన్న కాలనీల కోసం సమీకరించిన భూములకు పరిహారంగా రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన స్థలాలకు బేరం పెట్టి తమ పేరిట కాగితాలు రాయించుకున్నారు. తాజాగా ఈ బినామీ బాబుల్లో ఒకరు పిసినికాడలోని 80 ఎకరాల దళితుల ఎసైన్డ్‌ భూములపై కన్నేసి ఎకరాకు 13 లక్షలు చొప్పున చెల్లించి బలవంతంగా లాక్కున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం 60 లక్షలకు రూపాయలకు పైగానే ధర పలుకుతోంది. ఈ వ్యవహారంలో కొందరు దళితుల్ని ముందుపెట్టి తెరవెనుక ఆ బినామీ బాబు కథ నడుపుతున్నారు.

ఈ ప్రజాప్రతినిధి బినామీల్లో ఒకరు కశింకోట మండలంలో జగనన్న కాలనీలకు ప్రభుత్వంతో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్టజెప్పి, మిగతా మొత్తాన్ని తన జేబులో వేసుకున్నారు. బినామీలిద్దరూ పోలీసుస్టేషన్లలో పంచాయతీలు చేస్తుంటారు. వైసీపీ కార్యకర్త ఒకరు క్రికెట్‌ బెట్టింగ్‌లో ప్రధాన బుకీగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టుబడితే ఒక్క ఫోన్‌ కాల్‌తో అతన్ని ఈ నేత విడిపించారు. ఇలా బెట్టింగ్‌ రాయుళ్లు, మైనింగ్‌ మాఫియాకు రక్షణ కవచంలా నిలుస్తుంటారు.

ఈ ప్రజాప్రతినిధి ఆగడాల్ని ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తారు. సొంత పార్టీ వాళ్లయినా సరే ఎదురు తిరిగితే వాళ్ల ఆగ్రహానికి గురవ్వాల్సిందే. ఇద్దరు సొంత పార్టీ నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టించి, రౌడీషీట్‌లు తెరిపించిన ఘనుడు ఈయన. ఇక విపక్షానికి చెందినవారు సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులు పెడితే సాయంత్రానికి పోలీసు స్టేషన్‌లో పెట్టి వేధిస్తారు.

జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు: చంద్రబాబు - chandrababu praja galam yatra

ఈ ప్రజాప్రతినిధికి కుడిభుజంలాంటి నాయకుడు ఒకరున్నారు. అతని మాట ఆ ప్రజాప్రతినిధికి శిరోధార్యం.! డబ్బు పిండుకునే మార్గాలేంటి.? పైసా పెట్టుబడి లేకుండా ఎలా డబ్బు సంపాదించాలి.? ఏయే వ్యాపారాల్లో ఎవరెవర్ని కలుపుకోవాలి, పంపకాలు ఎలా చేసుకోవాలి? వంటి వ్యవహారాలన్నీ ఆ కుడి భుజంలాంటి నాయకుడి కనుసన్నల్లోనే జరుగుతాయి. అందుకే అతనికి జిల్లా పార్టీలో కీలకమైన పదవిని కట్టబెట్టారు.

ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నేతలు కొందర్ని భాగస్వాములుగా చేసుకుని 609 ఎకరాల్లో లే అవుట్‌ వేసి భారీ స్థిరాస్తి వ్యాపారానికి ఈ ప్రజాప్రతినిధి తెరలేపారు. దానికోసం కొందరు దళితుల భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. సుమారు 5 కోట్లకుపైగా విలువైన పదెకరాల ప్రభుత్వ భూముల్నీ కలిపేసుకున్నారు. అది తీవ్ర వివాదాస్పదమైనా, విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. తాజాగా ఈ నాయకుడు భార్య పేరుతో అచ్యుతాపురం సెజ్‌లో 38 సెంట్ల స్థలం తీసుకున్నారు.

బహిరంగ మార్కెట్‌లో 7.50 కోట్లు విలువైన ఈ భూమిని 80 లక్షలకు దక్కించుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని గ్రావెల్, మెటల్, గ్రానైట్‌ క్వారీల లీజుదారులు ప్రభుత్వం నుంచి పర్మిట్లు తీసుకున్నా ఈయనకు టన్నుకు ఇంతని కప్పం కట్టాల్సిందే. కొత్తగా ఎవరికైనా క్వారీ లీజు ఇవ్వాలంటే అనుమతి ఉండాల్సిందే. ఆయన ఆశీస్సులుంటే కొండల్ని పిండి చేసినా ఎవరూ పట్టించుకోరు. జిల్లాలో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయటి రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీతో ఇటీవల చేతులు కలిపిన ఆయన వాటాలు పొందినట్టు సమాచారం.

ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఒక గ్రామ సర్పంచి ఫిర్యాదు చేస్తుండటం, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తుండటంతో రెండేళ్లలో ఏడుగురు పంచాయతీ కార్యదర్శుల్ని మార్చేశారు. జమ్మాదులపాలెంలోని ఒక క్వారీ యజమానిని నానా ఇబ్బందులూ పెట్టి, తన అనుచరులకు వాటా ఇప్పించుకున్నారు. కొండను పూర్తిగా కొల్లగొట్టేస్తున్నారు. పక్క నియోజకవర్గ పరిధిలోని ఫెర్రో పరిశ్రమ నుంచి వచ్చే ఫ్లైయాష్‌ వ్యర్థాల అమ్మకాలు, రవాణాలో వాటా కోసం తమ వర్గీయులను రెచ్చగొట్టి పొరుగు ఎమ్మెల్యే అనుచరులతో బాహాబాహీకి దిగే పరిస్థితి కల్పించారు.

వైసీపీ ది రాక్షస పాలన- ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల అప్పుల భారం మోపారు: పురందేశ్వరి - Purandeswari Fires On CM Jagan

ఆ కంపెనీకి బొగ్గు సరఫరా చేసే ఓ ఏజెన్సీ ఆ నేతకు రెండు కార్లు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. సెజ్‌లో 220 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం పనుల్ని ఈ ప్రజాప్రతినిధి తన బినామీలకు కట్టబెట్టడంతో పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే పనులను నిలిపివేయడం వివాదాస్పదమైంది. గ్రామీణ సహకార విద్యుత్‌ సంస్థను కాసులురాల్చే కామధేనువుగా మార్చుకున్నారు. ఆ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 33 మంది దగ్గర 3 నుంచి 5 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఆ సంస్థను ఈపీడీసీఎల్‌లో విలీనం చేయడంతో డబ్బులిచ్చిన వారు ఉద్యోగాలురాక లబోదిదోమంటున్నారు.

అక్కిరెడ్డిపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిని ఆనుకుని 2009లో తన తాత పేరుతో ఉన్న ఛారిటబుల్‌ ట్రస్టుకు వంద గజాల స్థలం ఇప్పించుకున్నారు సదరు నేత. అక్కడ సేవాకార్య క్రమాలేమీ చేయకుండా అద్దెకు ఇచ్చేశారు. అదే ట్రస్ట్‌ కోసం మరో 200 గజాల ప్రభుత్వ స్థలం తీసుకుని తన వాహనాల పార్కింగ్‌కు వాడుతున్నారు. వేపగుంటలోని 164/1లో 14.60 ఎకరాల ఓ వివాదాస్పద భూమిలోనూ ఈ నేత హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

ఓ ఎమ్మెల్యే, మంత్రి పేరుతో 50 మంది బెదిరింపులకు దిగారని బాధితుడు ఆరోపించారు. భోగాపురంలో సెజ్‌ను ఆనుకుని 300 కోట్ల విలువైన భూమిపై రెండు కుటుంబాలకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక వర్గానికి ఈ ప్రజాప్రతినిధి, మరోవర్గానికి గతంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన కీలక నేత అండగా ఉండి సెటిల్‌మెంట్‌కు దిగినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details