YSRCP Leader Sudarshan Reddy Attack on Galiveedu MPDO: ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ నేత దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై అదే ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి ఎంపీడీవోని అడగడంతో ఎంపీపీ లేనిదే గది తాళాలు ఇచ్చేది లేదని జవహర్ బాబు చెప్పారు. అయితే తమకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా ఎంపీడీవోపై పిడి గుద్దులు కురిపించారు. అనంతరం దాడి చేసిన వైఎస్సార్సీపీ నాయకులు కేకలు వేసుకుంటూ కార్యాలయం బయటికి వచ్చారు. దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండడంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.
కార్యాలయం బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులు ఎంపీడీవోపై బూతులు తిట్టుకుంటూ వెళ్లారు. కార్యాలయంలోనే వైద్యులు ఎంపీడీవోకి ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపీడీవోపై దాడికి పాల్పడిన వైఎస్సార్సీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై ఎంపీడీవో ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్లుకున్న ఆ స్నేహబంధం ఏమిటో! - చర్యలు తీసుకోవడంలో మౌనం ఎందుకో?
గది తాళాలు ఇవ్వనందుకు సుదర్శన్‌రెడ్డి, ఆయన అనుచరులు నా మీద దాడి చేశారు. అడ్డొచ్చిన నా మేనల్లుడిపైనా దాడి చేశారు. నన్ను కొట్టిన తర్వాత అరగంటపాటు కార్యాలయంలోనే ఉన్నారు. రాత్రిలోగా నన్ను చంపేస్తామని సుదర్శన్‌రెడ్డి బెదిరించాడు. వైఎస్సార్సీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది. ప్రభుత్వం నాకు రక్షణ కల్పించాలి. సుదర్శన్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి ఆ గదిలో మందు తాగుతూ ఉంటాడు. ఇవాళ గది తాళాలు ఇవ్వలేదని నాపై మూకుమ్మడిగా దాడి చేశారు. జవహర్‌బాబు, ఎంపీడీవో
ఖండించిన టీడీపీ నేతలు: ప్రభుత్వం మారినా వైఎస్సార్సీపీ నేతల ఆగడాలు మాత్రం తగ్గలేదని రాయచోటి తెలుగుదేశం నేత సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. రాయచోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్‌ను సుబ్రహ్మణ్యం పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంతకం పెడతావా? - నువ్వూ శవమవుతావా! - పార్సిల్‌లో డెడ్ బాడీ కేసు కొలిక్కి