Elephants Destroy Crop Fields in Kurupam: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఏనుగులు ధ్వంసం చేసిన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కురుపాం మండలంలోని సీతంపేట, గోళ్లవలస గ్రామాల్లోని పంట పొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎంతో కష్టపడి రైతులు పండిస్తున్న పుచ్చ తోటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. దీంతో చేతికి వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేయడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు.
ఇలా ఏడాదికి మూడు, నాలుగు సార్లు ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని అన్నారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టిన పంటలు కళ్లముందే నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు ఏనుగులు తరలిస్తే తప్ప ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
అటవీశాఖ అధికారుల తీరుపై అసహనం: ఏనుగుల గుంపు ధ్వంసంలో నష్టపోయిన పంట వివరాలను తెలిపేందుకు రైతులు కురుపాం అటవీ రేంజ్ కార్యాలయంకి వెళ్లారు. ఏ ఒక్క అధికారి అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.