JC Prabhakar Reddy Sorry To Ultratech Cement Industry : అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై టీడీపీ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి క్షమాపణ చెప్పారు.
పాండ్ యాష్పై ఆదినారాయణరెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు, అక్కడ పని చేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదనే క్షమాపణ చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. తాను పాండ్ యాష్ కోసం పట్టుదలగా వ్యవహరిస్తున్నట్లు తన భార్య, కుమారులు హెచ్చరించడం వల్లనే మీడియా ముందుకు వచ్చి అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.
నా తప్పు ఉంటే తల తీసుకుంటాను : తాను పుట్టుకతోనే శ్రీమంతుడినని, డబ్బు కోసం పాండ్ యాష్ గొడవ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లారీలను అడ్డుకుని అద్దాలు పగలగొట్టిన వైఎస్సార్ జిల్లా పోలీసులు పట్టించుకోవడం లేదని జేసీ ఆరోపించారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు ఏ మాత్రం మారడం లేదని, ఐపీఎస్ అధికారులు సమస్య గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. తన వైపు నుంచి తప్పు ఉంటే తల తీసుకుంటానని జేసీ స్పష్టం చేశారు.
సచివాలయానికి చేరిన కూటమి నేతల ఫ్లైయాష్ వివాదం - సీఎం ఏమన్నారంటే?
ప్రజల ఆశీర్వాదంతోనే మళ్లీ అధికారం : గత ఐదు సంవత్సరాలలో తాను చాలా నష్టపోయానని, అనేక కష్టాలు ఎదుర్కొన్నానని జేసీ తెలిపారు. ఆర్థికంగా చాలా నష్టపోయినా ఎక్కడా తల వంచలేదని తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు నిలిచి పోరాడానని, ప్రజల ఆశీర్వాదంతోనే మళ్లీ అధికారంలోకి వచ్చామని అన్నారు.
"మా వల్ల అల్ట్రాటెక్ పరిశ్రమ, కార్మికులకు ఇబ్బంది రాకూడదు. నా భార్య, కుమారులు చెప్పడం వల్లే పరిశ్రమ యాజమాన్యానికి క్షమాపణ చెబుతున్నా. గొడవ వల్ల ఏ కార్మికుడు నష్టపోకూడదనే మీడియా ముఖంగా యాజమాన్యానికి క్షమాపణ తెలియజేస్తున్నా. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.":- జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవ్వరినీ ఉపేక్షించను - 'బూడిద' గొడవపై చంద్రబాబు అసహనం