Kanaka Mahalakshmi Temple Vizag History : దక్షిణాదిన ముఖ్యంగా తెలుగునాట అతి ప్రాచీనమైన ఆలయాలను చూడవచ్చు. విశాఖ వాసుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
విశాఖ పాలకుల ఇలవేలుపు
విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం. విశాఖ నగరంలోని బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ వంద సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరే! సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది.
బురుజుపేట పేరు ఇందుకే!
విశాఖ రాజుల కోట బురుజు అమ్మవారు వెలసిన పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి.
స్వయంభువు అమ్మవారు
శ్రీ కనక మహాలక్ష్మి దేవి స్వయంభువుగా వెలసిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఒక కథనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహం బావిలో లభించింది. అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్టించారు. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేకమంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్లీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు. దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందినది.
మరో కథనం ఇలా!
మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై, తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని కోరుతుంది. అయితే, ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని ప్రాదేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి, అమ్మవారి వామ హస్తాన్ని మోచేతి పైవరకు ఖండిచి, శాంతిపజేస్తాడు. కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు. అందుకే, ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు.
గోపురం లేని ఆలయంలో భక్తులే స్వయంగా పూజ
కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమి ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమా చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు. పూజారులు ఎవరూ ఉండరు.
సంతానం ప్రసాదించే తల్లి
సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు, కుంకుమలతో, పాలు పవిత్ర జలాలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సంప్రదాయం. శ్రీ కనక మహాలక్ష్మికి గురువారమంటే ప్రీతికరం. ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు.
వార్షిక మహోత్సవాలు
ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం. మార్గశిర మాసం సందర్భంగా మనం కూడా ఆ కనకమహాలక్ష్మిని సందర్శించి సంతాన సౌభాగ్యాలను పొందుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.