Unloading Ration Rice From Stella Ship has Begun at Kakinada Port : కాకినాడ తీరంలో నెలన్నరగా లంగరు వేసిన స్టెల్లా నౌకలోని రేషన్ బియ్యం దించే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ గుర్తించిన 1320 టన్నుల బియ్యాన్ని శుక్రవారం కొంతమేర దించారు. పూర్తిగా అన్‌లోడ్ చేశాక ఎగుమతిదారుల ఆర్డర్ ప్రకారం వివిధ రకాల బియ్యాన్ని నింపి నౌకను గమ్యస్థానానికి పంపనున్నారు. మరోవైపు రేషన్ మాఫియా అక్రమాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన సిట్ రావడంలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన "సీజ్ ద షిప్" డైలాగ్‌తో కాకినాడ తీరంలో నిలిచిపోయిన స్టెల్లా నౌక త్వరలోనే గమ్యస్థానానికి బయలుదేరనుంది. ప్రస్తుతం ఈ నౌకలో జిల్లా కలెక్టర్ గుర్తించిన PDS బియ్యాన్ని అన్‌లోడింగ్ చేస్తున్నారు. నవంబర్ 11న హల్దియా నుంచి వచ్చిన స్టెల్లా ఎల్ పనామా నౌక కాకినాడ యాంకరేజీ పోర్టుకు 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ కొటోనౌ పోర్టుకు 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నుల బియ్యాన్ని నౌకలో నింపగా కలెక్టర్, అధికారుల బృందం తనిఖీల తర్వాత 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
బియ్యం రవాణాకు అనుమతులున్నాయా?: హైకోర్టు
ఆ తర్వాత అక్కడికెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షిప్‌ని సీజ్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు అల్పపీడనం ప్రభావం తగ్గి వాతావరణం అనుకూలించడంతో శుక్రవారం నౌకలో నుంచి బియ్యం దించే ప్రక్రియను ప్రారంభించారు. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో బార్జిలోని రేషన్ బియ్యాన్ని క్రేన్ సాయంతో కొంతమేర దించారు. బియ్యం పూర్తిగా అన్‌లోడ్ చేసిన తర్వాత 19,785 టన్నుల బియ్యం లోడింగ్‌కు ఎగుమతిదారులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనవరి 3, 4 తేదీల్లో స్టెల్లా నౌక కొటోనౌ పోర్టుకు బయలుదేరే అవకాశం ఉంది. అయితే నౌక బయలుదేరేందుకు ప్రభుత్వ అనుమతితో పాటు పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది.
కాకినాడ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న రేషన్ బియ్యం రవాణా అడ్డుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. చెక్‌పోస్టులు పెంచినా, కీలక శాఖల బృందాలు తనిఖీలు ముమ్మరం చేసినా రేషన్ మాఫియా ఆగడం లేదు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ- సిట్ రావడంలో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. సిట్‌లోని అధికారుల్లో మార్పులు చేర్పులు చేయడంతో కొత్త బృందం ఎప్పుడు వస్తుందో అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బియ్యం దొంగల భరతం పట్టేందుకు సిద్ధమవుతోన్న ఏపీ సర్కార్
అలలపై ఊగిసలాటలా స్టెల్లా నౌక భవితవ్యం - 'సీజ్ ద షిప్' సాధ్యమేనా!