Health Minister Tweet on Clinical Psychology course in AP : ఏపీలో మొదటిసారిగా క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించబోతున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైద్య రంగానికి కీలకమైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేకపోవటం దురదృష్టకరమని అన్నారు. ఈ అంశంపై ఎక్స్ లో ట్వీట్ చేసిన మంత్రి దానికి సంబంధించిన సమాచారం పంచుకున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధినిర్ధారణ చికిత్స అందించటంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. దీంతోపాటు అన్ని రకాల రోగులు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవడంలోనూ వారు ప్రధాన భూమిక పోషిస్తారని మంత్రి స్పష్టం చేశారు.
మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ సైకాలజిస్టులు ఎక్కడా లేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎక్కడా క్లినికల్ సైకాలజీ కోర్సులు నిర్వహించకపోవటమే దీనికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. క్రమేపీ పెరుగుతున్న మానసిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని క్లినికల్ సైకాలజిస్టుల లోటును అంచనా వేస్తూ త్వరలో రెండేళ్ల వ్యవధితో కూడిన ఎం.ఫిల్ కోర్సుతో పాటు ఒక ఏడాది పాటు ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సుని ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు.
ఈ రెండు కోర్సుల్ని వీలైనం త్వరగా ప్రారంభించేందుకు వీలుగా మార్గదర్శకాలను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్టు తెలిపారు. క్లినికల్ సైకాలజీ విద్యను నియంత్రించే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు చేసి ఎంతో ఉపయోగకరమైన ఈ కోర్సుల్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
ఏపీలో హెచ్‌ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదు - ప్రజలు భయపడొద్దు: మంత్రి సత్యకుమార్
ఆస్పత్రుల్లో MAY I HELP YOU డెస్క్లు- అందుబాటులో మహా ప్రస్థానం వాహనాలు:సత్యకుమార్