How to check BP at Home in Telugu: లోబీపీ లేదా హై బీపీ.. ప్రస్తుత రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్తనాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తుంది. ఇక రక్తపోటును అధిగమించాలంటే ఆహార నియమాలపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా రెగ్యులర్‌గా బీపీ చెకప్ చేయించుకోవాలి. అయితే.. ఇటీవల కాలంలో చాలా మంది ఇంట్లోనే సొంతంగా డిజిటల్ మెషీన్లు ఉపయోగించి బీపీని చెక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీపీని చెక్ చేయడానికి సరైన పొజిషన్ ఏది? బీపీ ఎలా చెక్ చేసుకోవాలి? అనే వివరాలపై హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ స్కూల్ తమ అధికారిక వెబ్సైట్లో ఓ ఆర్టికల్ ప్రచురించింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీపీ చెక్ చేసుకునేందుకు బెస్ట్ పొజిషన్: బీపీని చెక్ చేసుకునే సమయంలో వ్యక్తి సరైన పొజిషన్‌లో ఉండాలని.. లేకపోతే రీడింగ్‌ని సరిగ్గా చూపించదని నిపుణులు అంటున్నారు. కాబట్టి చెకప్ చేసే సమయంలో కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చోవడం మేలని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌లో చీఫ్ మెడికల్ ఎడిటర్ డాక్టర్ Howard E. LeWine అంటున్నారు. కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను నేలపై సరిగ్గా ఉంచాలని.. గుండెకు సమాంతర ఎత్తులో ఉండే టేబుల్‌పై చేతులను ఆసరాగా ఉంచాలంటున్నారు.
ఏ చేతితో రీడింగ్ తీసుకోవాలి: బీపీని ఎడమ లేదా కుడి చేతి నుంచి కొలవవచ్చని అంటున్నారు. కొన్ని సార్లు రెండు చేతులకో కొలవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఒక చేతితో కొలిచినప్పుడు ఒక రీడింగ్ ఉంటే మరో చేతితో కొలిచినప్పుడు వేరే రీడింగ్ ఉండవచ్చంటున్నారు. అయితే సాధారణంగా బీపీ రీడింగ్ ఒక చేతి నుంచి మరో చేతి వ్యత్యాసం 5 లేదా అంతకన్నా తక్కువ పాయింట్లు ఉన్నా, లేదంటే రెండు చేతుల మధ్య వ్యత్యాసం 10 పాయింట్ల కంటే ఎక్కువున్నా డాక్టర్లను సంప్రదించాలంటున్నారు.
ఇంట్లో సరైన రీడింగ్ ఇలా..
- రీడింగ్ తీసుకోవడానికి కనీసం అరగంట ముందు కెఫెన్ కలిగిన డ్రింక్స్ తాగడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి చేయవద్దని సూచిస్తున్నారు.
- రీడింగ్ తీసుకునేముందు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఓ 5 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెబుతున్నారు.
- మానిటర్ కఫ్ని క్లాత్ మీద కాకుండా స్కిన్‌పై ఉంచేలా చూసుకోవాలంటున్నారు.
నార్మల్ బ్లడ్ ప్రెజర్ రీడింగ్.. రక్తపోటును చెక్ చేసే మెషీన్ మానిటర్ రెండు నెంబర్లని చూపిస్తుందని.. పైన ఉన్న నెంబర్ని సిస్టాలిక్ అనీ, కింద నెంబర్ని డయస్టాలిక్ అని అంటారంటున్నారు. హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు ఉన్న ప్రెజర్‌ని సిస్టాలిక్ నంబర్ చూపిస్తే, హార్ట్ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు ఉన్న బ్లడ్ ప్రెజర్‌ని డయస్టాలిక్ రీడింగ్ చూపిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ని మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ (ఎంఎంహెచ్‌జీ)లో సూచిస్తారు. మేలని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం బ్లడ్‌ప్రెజర్‌లో నాలుగు క్యాటగిరీలు ఉన్నాయి. అవి
- సాధారణ రక్తపోటు - 120/80 ఎంఎం హెచ్‌జీ కంటే తక్కువ
- ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ - 120 /80 to 129/79 ఎంఎంహెచ్‌జీ
- హైపర్ టెన్షన్ స్టేజ్ 1 - 130/80 నుంచి 139/89 ఎంఎం హెచ్‌జీ
- హైపర్ టెన్షన్ స్టేజ్ 2 - 140/90 ఎంఎం హెచ్‌జీ లేదా అంత కంటే ఎక్కువ
రక్తపోటు తక్కువగా ఉంటే ఏమవుతుంది? - నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?