SI CONSTABLE DEATH CASE: తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ చెరువులో మునిగిపోవడం వల్లే మరణించారని పోస్ట్‌మార్టం రిపోర్డులో వెల్లడైంది. ముగ్గురి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్థారించారు. శ్రుతి, నిఖిల్ ఆత్మహత్య గురించి మాట్లాడుకున్నట్లు వాట్సాప్ సందేశాలు ద్వారా గుర్తించారు. అయితే వీరితో సాయికుమార్‌కు సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట యువకుడు నిఖిల్ కేసు వెనక ఉన్న కారణాలపై మిస్టరీ వీడలేదు. వీరు ముగ్గురూ చెరువులో మునగడంతోనే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికల్లో వెల్లడైంది. ముగ్గురు శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, నీటిలో ఊపిరాడకే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే ముగ్గురూ కలిసే చనిపోయారా లేక ఒకరు ఆత్మహత్యకు యత్నిస్తే కాపాడే క్రమంలో మిగతా ఇద్దరూ మరణించారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముగ్గురి సెల్‌ఫోన్లు 25 తారీఖున స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించిన పోలీసులు, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ నుంచి వారు మరణించిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకూ దారి పొడవునా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
చనిపోతానంటూ వాట్సప్‌లో చాటింగ్: ముగ్గురి కాల్‌డేటా, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలించగా శ్రుతి, నిఖిల్ మధ్య ఆత్మహత్యకు సంబంధించి సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ నేను చనిపోతానంటే, నేను చనిపోతానంటూ వాట్సప్‌లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాలను సైతం ఎస్సై సాయికుమార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సాయికుమార్‌కు చెందిన మూడు సెల్‌ఫోన్లలో రెండు లాక్ అయి ఉన్నాయని, వాటి పరిశీలించిన తర్వాతే మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
అక్కడికే ఎందుకు వచ్చారు: అలాగే ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ముగ్గురు ఎలా చేరుకున్నారనే దానితో పాటు ఇక్కడికే ఎందుకు వచ్చారనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇంకా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ఈ ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయించారు. దీనికోసం ఉన్నతాధికారులకు పోలీసులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ముగ్గురి మృతుల కుటుంబీకులు, బంధువులు, ఫ్రెండ్స్ వాంగ్మూలాలు తీసుకోనున్నారు. అదే విధంగా 2018 బ్యాచ్‌కి చెందిన పోలీసుల నుంచి ఎస్సై సాయికుమార్ నడపడిక ఇతరత్రా విషయాలను ప్రత్యేక బృందం సేకరిస్తోంది.
చెరువులో మహిళా కానిస్టేబుల్, ఎస్సై మృతదేహాలు - అంతుచిక్కని మిస్టరీ ఏంటి?