YS Sharmila on Actor Prabhas and Jagan : ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మట్లాడారు. జగన్ తన సొంత ప్రయోజల కోసం తల్లి, చెల్లి పేర్లను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తనపై బాలకృష్ణ ఇంటి ఐడీ నుంచి దుష్ప్రచారం జరిగినట్లు ఓ వీడియో చూపించిన జగన్‌మోహన్‌రెడ్డి, సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే, ఐదేళ్లు సీఎంగా ఉండి ఏమీ చేశారని జగన్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.
బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని షర్మిల నిలదీశారు. ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన వెంటనే ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేసినప్పుడు కూడా ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పానని గుర్తుచేశారు. ప్రభాస్‌కు తనకు సంబంధం ఉందని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, పిల్లలపై ఒట్టేసి చెబుతున్నానని పేర్కొన్నారు. ప్రభాస్‌ను తాను నేరుగా ఎప్పుడూ చూడలేదని అన్నారు.
'నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇప్పటి వరకూ చూడలేదు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా. ఆయన ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు వ్యక్తిత్వం లేనట్లు జగన్ ఈ ప్రచారం చేయించారు'- షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు