New EV Car Launches In 2025 : ప్రయాణం చాలా మందికి ప్రత్యేకమైన అనుభూతి. ఈ కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతుంటారు. అందుకే వాహన తయారీ సంస్థలు కూడా ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్లుగా వివిధ మోడల్స్‌ను ఏడాది ప్రారంభంలోనే తెస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త ఈవీ కార్లు, మెడల్స్ ఏంటో చూసేద్దాం పదండి.
మారుతి సుజుకీ ఇ-విటారా
Maruti Suzuki e Vitara : ఈ ఏడాది విడుదల కానున్న కార్లలో మారుతి సుజుకీ ఇ-విటారా చాలా ముఖ్యమైనది. జనవరి 17-22 వరకు జరగనున్న 'భారత్ మొబిలిటీ షో 2025' లో ఈ కార్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇంతకుముందు సంస్థ ప్రకటించిన eVX కాన్సెప్ట్‌నకు చాలా దగ్గరగా ఈ కారు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయినా చాలా శక్తిమంతంగా, రగ్డ్ లుక్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కారు 49kWh (144hp పవర్), 61kWh (184hp పవర్) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇ-విటారాలో ఆప్షనల్‌గా డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్- AWD వ్యవస్థ కూడా పొందుపర్చినట్లు సమాచారం. అయితే ఈ విద్యుత్ కారు రేంజ్‌పై మాత్రం కంపెనీ ఇంతవరకు అధికారికి ప్రకటన చేయలేదు. 61kWh బ్యాటరీతో గ్లోబర్ టెస్ట్ సైకిల్స్‌లో 500 కిలోమీటర్ల కంటే ఎక్కు రేంజ్ ఇచ్చిందని తెలుస్తోంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ
Hyundai Creta EV : భారత్ మొబిలిటీ షో 2025లో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ క్రెటా ఇవీని ప్రదర్శించనుంది. మారుతి సుజుకీ ఇ-విటారాకు పోటీగా హ్యూందాయ్ ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. క్రెటా ఈవీని అడాప్టెడ్ వెర్షన్ ICE ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. దాదాపు పాత క్రెటా లాగానే ఉంటుంది. కానీ ఈవీ కార్లకు ఉండాల్సిన కొన్ని ప్రత్యేక డిజైన్ అప్డేట్స్ ఉంటాయి. అయితే ఈ కారు క్యాబిన్- ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్, కోన(విదేశీ మార్కెట్లలో లభ్యమయ్యే కారు) కార్లకు చాలా దగ్గరగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రెటా ఈవీ 45kWh బ్యాటరీ, ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 400కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని సమాచారం.
ఎమ్జీ సైబర్‌స్టర్
MG Cyberster : ఎమ్జీ సెలెక్ట్ రిటైల్ ఛానల్ ద్వారా సైబర్‌స్టర్ స్పోర్ట్స్ కార్లను సంస్థ విక్రయించనుంది. త్వరలో జరగబోయే భారత్ మొబిలిటీ షోలో ఈ కారు ధర వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. రెండు డోర్లతో వచ్చే ఈ కారులో 77kWh బ్యాటరీని పొందుపర్చారు. ప్రతి యాక్సిల్‌కు రెండు మోటార్లు అమర్చి ఉన్న ఈ కారు AWD సెటప్‌తో వస్తోంది. ఈ సైబర్‌స్టర్ 510hp పవర్, 725Nm టార్క్ ఉత్పత్తి చేసే ఈ కారు 3.2 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకుంటుందని సమాచారం. అంతేకాకుండా చైనా లైట్-డ్యూటీ వెహికిల్ టెస్ట్ సైకిల్-CLTCలో ఈ కారు 580కిలోమీటర్ల రేంజ్ ఇచ్చిందని ఎమ్జీ చెబుతోంది.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ
Mahindra BE 6 and XEV 9e : మహీంద్రా నుంచి వస్తున్న 'సుపర్ క్లాస్' ఈవీ కార్లు బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ. ఈ రెండు కార్ల ధరలను కంపెనీ ఇదివరకే ప్రకటించింది. అయితే త్వరలో జరగబోయే మొబిలిటీ షోలో ఈ ఎస్‌యూవీల ఫుల్ ప్రైజ్ లిస్ట్‌ను మహీంద్రా ప్రకటించనుంది. ఈ కార్లు INGLO ఈవీ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి. కాన్సెప్ట్ కార్ల లాగా వీటిని డిజైన్ చేశారు. రెండు కార్లు 228hp పవర్ ఉత్పత్తి చేసే 59kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. సింగిల్ ఛార్జ్‌లో బీఈ-6 556కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 542కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
మెర్సిడిస్ జీ 580 EQ
Mercedes G 580 with EQ Technology : ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడిస్ బెంజ్ సరికొత్త ఎలక్ట్రిక్ జీ క్లాస్ కారు జీ-580ను త్వరలో విడుదల చేయనుంది. భారత్ మొబిలిటీ షోలో కాకుండా జనవరి 9న జరిగే ప్రత్యేక ఈవెంట్లో ఈ కారును లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. ఈ కారు ICE-పవర్డ్ జీ-క్లాస్ కారు డిజైన్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు ఆఫ్-రోడింగ్ అబిలిటీని మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ చెబుతోంది. జీ-580 కారు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తోంది. 116kWh బ్యాటరీతో 587hp పవర్, 1165Nm టార్క్ ఉత్పత్తి చేసే ఈ కారు, కేవలం 5 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకుంటుందని సమాచారం. EQ (Electric Intelligence) టెక్నాలజీతో వస్తున్న ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 470కిలోమీటర్లు రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మెర్సిడిస్ EQS ఎస్యూవీ నైట్ ఎడిషన్
Mercedes EQS SUV Night Edition : జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారు కాకుండా మెర్సిడిస్-బెంజ్ EQS ఎస్‌యూవీల్లో మరో రెండు కొత్త వేరియంట్లను లాంఛ్ చేయనుంది. మేబ్యాక్ నైట్ ఎడిషన్, EQS 450(5 సీటర్ వేరియంట్) కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. మేబ్యాక్ నైట్ ఎడిషన్ కారులో EQS 680 స్పెసిఫికేషన్స్ ఉన్నారు. టూ టోన్ బ్లాక్ కలర్లో ఎక్స్టీరియర్ను డిజైన్ చేశారు. ఇదిలా ఉండగా EQS 450 కారులో పొందుపర్చిన 122kWh సామర్థ్యం గల బ్యాటరీ 544hp పవర్, 58Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
మరోవైపు, ఈ కార్లు మాత్రమే కాకుండా మరికొన్ని కార్లు కూడా భారత్ మొబిలిటీ షోలో తొలిసారి ప్రదర్శితమవుతున్నాయి. అందులో సరికొత్త స్కోడా కోడియాక్, స్కోడా సూపర్బ్, హ్యుందాయ్ ఐయోనిక్ 9, స్కోడా ఎల్రాక్, కియా సిరోస్, బీఎమ్‌డబ్ల్యూ X3 వంటివి ఉన్నాయి.