Netizens Slams Youtuber Praneeth Hanumanthu:సోషల్ మీడియా సామాన్యుల భావ ప్రకటనకు వేదిక. కానీ నేడు అవి అడ్డూఅదుపూ లేని తప్పుడు సమాచారాన్నీ, వందతులనూ వ్యాప్తి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక యూట్యూబర్ స్నేహితులతో కలసి వీడియో ఛాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు.
అమెరికాలో ఉన్న ప్రణీత్ హనుమంతు ఓ యూట్యూబ్ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్ చేశాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్ గురించి లైవ్‌లో మాట్లాడారు. ఆ రీల్లో ఒక తండ్రి, కూతురు ఉంటారు. తండ్రీ కూతుళ్ల మధ్య అసభ్యకర సంబంధం అనే అర్థం వచ్చేలా సంభాషించాడు. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సినీ నటుడు సాయిదుర్గ తేజ్ దారుణంగా వీడియోలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.
అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు :ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు మరికొందరిని సాయిదుర్గ తేజ్ ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా యూట్యూబ్‌లో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు.