తెలంగాణ

telangana

ETV Bharat / state

YUVA : ఎలాంటి కోచింగ్‌ లేకుండానే గ్రూప్‌-4 ఉద్యోగాలు సాధించిన యువకులు - GROUP 4 JOBS WITHOUT COACHING

తల్లిదండ్రుల కష్టాల్ని చూసిన యువకులు - పుస్తకాలతో కుస్తీ పడి ఉద్యోగాల వేట - ప్రస్తుతం తూప్రాన్‌లో వివిధ హోదాల్లో విధులు - యూపీఎస్సీ, గ్రూప్‌-1, 2 కొలువులు సాధించడమే లక్ష్యమని వెల్లడి

Group-4 Jobs Without Coaching
Government Jobs (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 7:32 AM IST

Group-4 Jobs Without Coaching : వారంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన యువకులే. చదువే ధ్యాసగా, ఉద్యోగమే లక్ష్యంగా, చిన్న వయసులోనే ప్రభుత్వ కొలువులు సాధించారు. తల్లిదండ్రులు ఒకరు వ్యవసాయం చేస్తుంటే, మరొకరు సైకిల్‌ మెకానిక్‌గా కాలం వెళ్లదీస్తూ, పిల్లలను కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన ఆ యువత, పుస్తకాలతో స్నేహం చేసి ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇంతకీ ఎవరా యువసైన్యం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఫలితాలలో మెరిట్​ : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-4 ఫలితాలలో ఉద్యోగాలు సాధించి అందరి మన్నలు పొందుతున్నారీ యువకులు. ఎటువంటి కోచింగ్‌ లేకుండానే సొంతంగా ప్రిపేర్​ అయ్యి సర్కార్​ కొలువులు సాధించారు.

"నా బీటెక్ చదువు 2019లో పూర్తయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశతోనే దాని కోసమే ప్రిపే​ర్​ అయ్యా. 2019లో యూపీఎస్సీకి ప్రిపేర్​ అయ్యి అటెంప్ట్​ ఇచ్చాను. కానీ మిస్సయ్యింది. ఆ టైంలోనే గ్రూప్​-4 నోటిఫికేషన్​ వచ్చింది. అప్లై చేసి సొంతంగా ప్రిపేర్​ అయ్యి జాబ్​ సాధించా" -నరేష్​, వార్డు ఆఫీసర్, తూప్రాన్​ మున్సిపాలిటీ

తల్లిదండ్రుల కష్టానికి దక్కిన ఫలితం : మీరు చూస్తున్న ఈ యువకులు మెదక్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించిన చదువులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వావ్‌ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం తూప్రాన్ మున్సిపల్‌ కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. యువత సాయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తూప్రాన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గణేష్‌ రెడ్డి తెలిపారు. ఇటీవల ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. నేరుగా ప్రజా క్షేత్రంలో విధులు నిర్వహించడం వారికి మంచి అనుభూతిని ఇస్తుందని వివరించారు.

గ్రూప్​-1,2 లపై గురి : ఒక ఉద్యోగం వచ్చింది కదా అని ఊరుకోకుండా దానికంటే ఉన్నత స్థాయిలో కొలువు సాధించాలని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారీ యువకులు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే ఖాళీ సమయాల్లో యూపీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలు సాధించేందుకు సొంతంగా కసరత్తు చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఉద్యోగం రాలేదని ఎప్పుడూ నిరాశ చెందకూడదని చెబుతున్నారీ యువకులు.

స్థిరపడి లక్ష్యం దిశగా : నిత్య విద్యార్థిలాగా ప్రతి రోజూ ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడంతో ఆ విజ్ఞానం ఎక్కడో చోట ఉపయోగపడుతుందన్నారు. కష్టపడి ప్రయత్నిస్తే తప్పనిసరిగా విజయం సొంతమవుతుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ కొలువులు సాధించవచ్చని నిరూపించారీ యువకులు. చిన్న స్థాయిలో ఉద్యోగమని వదిలేయకుండా ముందు స్థిరపడి తమ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కుటుంబ కష్టాలన్ని దాటుకొని కష్టపడి చదువుకొని కొలువులు సాధించామంటున్నారీ యువకులు. ఊరిలోని లైబ్రరీని ఉపయోగించుకొని పోటీపడుతున్న యువతను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్లి పనిచేయడం సంతృప్తి పరిచిందని వివరించారు. ప్రస్తుతం సాధించిన ఉద్యోగాలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో ఉన్నత కొలువులు సాధించడమే లక్ష్యమంటున్నారీ యువకులు. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొవచ్చని నిరూపించారీ యువత.

పరీక్ష లేకుండానే నెలకు రూ.లక్ష జీతంతో జాబ్ - వెంటనే అప్లై చేసుకోండి

2008 DSC బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు - విద్యాశాఖ ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details