సైక్లింగ్‌లో సత్తా చాటుతున్న యువకుడు- 9వ సారి జాతీయ పోటీలకు ఎంపిక Young Man Excels in Cycling:వెయ్యి సార్లు విఫలమైనా పట్టువదలక ప్రయత్నించి బల్బు కనిపెట్టాడు ఎడిసన్. అతనినే స్ఫూర్తిగా తీసుకున్నాడేమో ఈ యువకుడు. అవాంతరాలు ఎన్ని ఎదురైనా అలుపెరుగని యోధుడిలా సాధన చేస్తున్నాడు. 8 సార్లు జాతీయ సైక్లింగ్‌లో పాల్గొని అపజయం చవిచూసినా, గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు ఉత్సాహంతో మరోసారి జాతీయ సైక్లింగ్ పోటీలో సత్తా చాటడానికి కఠోరంగా శ్రమిస్తున్నాడు.
విజయనగరం జిల్లా ఆర్.వసంత అనే గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు దమరసింగి గణేశ్. తల్లిదండ్రులు రాము, సన్యాసమ్మలు రోజువారి కూలీలు. చిన్నప్పటి నుంచి కుంటుంబ పరిస్థితులు ఈ కుర్రాడిని ఏదో ఒకటి సాధించమని చెప్పాయి. దాంతో సరదాగా నేర్చుకున్న ఈతను క్రీడగా మలచుకున్నాడు.
ఇంటర్ చదువుతున్నప్పుడే జిల్లా స్థాయి ఈత పోటీల్లో ప్రతిభ చూపాడు గణేశ్. కానీ, సౌకర్యాల కొరతతో సైక్లింగ్ పై దృష్టి సారించాడు. అనతి కాలంలోనే జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. రాష్ట్రస్థాయిలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకుని జిల్లాలో తనకంటూ పత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
తలపై చెరుకు గడలతో 14కి.మీ సైక్లింగ్- కూతురిపై ప్రేమతో పెద్దాయన సాహసం
సైక్లింగ్‌లో రాణిస్తున్న ఈ యువకుడికి ఎదురుదెబ్బ తగిలింది. సైక్లింగ్ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుంటున్న క్రమంలో కాలికి గాయమైంది. ఇక సైక్లింగ్ చేయడం కుదరదన్నారు వైద్యులు. కానీ తన పట్టుదల ముందు గాయం చిన్నదైపోయింది. 6నెలల విశ్రాంతి అనంతరం మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు.
ఆల్ ఇండియా, ఓపెన్ గేమ్స్, స్కూల్ గేమ్స్‌లో రాణించాడు. సైక్లింగ్‌లో దూసుకుపోతున్న ఈ యువతేజం గణేశ్‌ను ఆర్థిక ఇబ్బందులు, అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. 8 దఫాలుగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా అత్యాధునిక సైకిల్ లేక వెనకబడుతున్నాడు.
63ఏళ్ల వయసులో రోజూ 50కిమీ సైక్లింగ్- 100 రోజుల్లోనే 5వేల కిమీ పూర్తి, ఇండియా బుక్‌లో స్థానం
గ్రామంలోని ఉద్యోగులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే జాతీయ సైక్లింగ్ పోటీలకు వెళ్తున్నాడు గణేశ్. తన దగ్గరున్న సైకిల్ కూడా వారి ప్రోత్సహంతోనే కొనుగోలు చేశాడు. రవాణా ఖర్చులకు కూడా దాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తే జాతీయ, అంతర్జాతీయంగా పతకాలు సాధిస్తానని గణేశ్ చెబుతున్నాడు.
"సైక్లింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా నేను ముందుకుపోతున్నాను. అయితే ఆర్థిక ఇబ్బందులు, అసౌకర్యాలు సమస్యలతో సతమతమవుతున్నాను. రవాణా ఖర్చులకు కూడా దాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నాను. ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తే జాతీయ, అంతర్జాతీయంగా పతకాలు సాధిస్తా." - దమరసింగి గణేశ్, సైక్లింగ్ క్రీడాకారుడు
ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాలలో బీపీఈడీ చేస్తున్నాడు గణేశ్. పట్టువీడని విక్రమార్కుడిలా నిత్యం సాధన చేస్తున్నాడు. ఇతర రాష్ట్ర క్రీడాకారుల్లా గణేశ్ దగ్గర అత్యాధునిక సైకిల్ ఉంటే పతకాలు సాధిస్తాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్నా సాధించాలనే తపన బలంగా ఉందంటున్నాడు గణేశ్. జాతీయ, అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
సైక్లింగ్, వాకింగ్, స్కేటింగ్- అయోధ్యకు భక్తుల సాహసయాత్రలు- ఇతర మతస్థులు కూడా!