YSRCP Leader Sajjala Attend to Police Enquiry : వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు విచారణ నోటీసులు జారీ చేయడంతో ఆయన స్టేషన్‌కు వచ్చారు. సజ్జలతోపాటు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా స్టేషన్ వద్దకు వెళ్లారు. విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పొన్నవోలు వేలు చూపించి మరీ పోలీసులను స్టేషన్ వద్ద బెదిరించారు.
విచారణ సమయంలో న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లారు. అనంతరం మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించారు. కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తమ పార్టీ నేతలను పోలీసులు వేధిస్తున్నారని విచారణ అనంతరం సజ్జల ఆరోపించారు.
'టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారించాం. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగాం. చాలా ప్రశ్నలకు గుర్తు లేదనే సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో సజ్జల సలహాదారుగా ఉన్నారు. మా వద్ద ఉన్న ఆధారాలతో సజ్జలను ప్రశ్నించాం. సజ్జలను ఫోన్ అడిగినా ఇవ్వలేదు. విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించలేదు. మా ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు తాను అక్కడ లేనని చెప్పారు. ఈ కేసులో సజ్జల పాత్ర ఉన్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. మూడు నెలలుగా ఈ కేసును విచారించాం. కేసు దర్యాప్తు దాదాపు చివరకు వచ్చింది. చాలామంది నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందారు. దీనివల్ల కేసు విచారణ వేగంగా జరగట్లేదు. నిందితులను అరెస్టు చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుంది. కేసును ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది. ఉత్తర్వులు రాగానే విచారణ దస్త్రాలను సీఐడీకి ఇస్తాం'.: -మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు