Yadadri Temple Gets Huge Income :తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. 48 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 4 కోట్ల 17 లక్షల 13 వేల 596 నగదును భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు ఈ మేరకు వెల్లడించారు. అలాగే 228 గ్రాముల బంగారం, 7.5 గ్రాముల వెండిని కూడా భక్తులు స్వామికి కానుకల రూపంలో సమర్పించినట్లు తెలిపారు.
పలు దేశాల నుంచి నగదు (ఫారెన్ కరెన్సీ) సైతం హుండీ లెక్కింపులో బయటపడిందని, అది కూడా భక్తుల కానుకగానే స్వీకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామి వారికి కానుకలు సమర్పించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ఈఓ భాస్కర్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర నరసింహ మూర్తి, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు హుండీ లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. దేవస్థానం కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు.