Photos and Videos Banned in Yadadri : సాధారణంగా ఫ్రెండ్స్‌తో అయితే సదదాగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటాం. అదే ఫ్యామిలీతో అయితే ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా వెళ్తాం. దేవుడిని దర్శనం చేసుకుని ఎప్పుడు గుర్తిండిపోయేలా ఆలయ పరిసర ప్రాంతాలను మన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తాం. అంతే కాకుండా సెల్ఫీలు అంటూ, ఫ్యామిలీతో గుడికి వచ్చినట్లు తెలిసేలా ఫొటోలు దిగుతాం. చిన్న చిన్న ఆలయాల్లో అయితే ఫర్వాలేదు కానీ ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో కూడా కొందరు ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పైగా ఈ రోజుల్లో అయితే కేవలం ఫొటోలే కాకుండా రీల్స్ కోసమని ఆలయంలోనే వీడియోలు తీసుకుంటున్నారు.
భక్తులు సైతం ఆలయంలో కొందరు చేస్తున్న రీల్స్ చూసి మండిపడుతున్నారు. రీల్స్ కోసమే గుడికి వస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ అధికారులు భక్తులకు షాక్ ఇచ్చారు. ఇకపై గుడికి వచ్చే భక్తులు అలా చేయకూడదని హెచ్చరించారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ, క్షేత్ర ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినేలా అధ్యాత్మికేతర వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఇకపై ఎవరు కూడా చిత్రీకరించొద్దు అంటూ హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లో అనుమతి ఉన్న చోట ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఫొటో, వీడియో చిత్రీకరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు.