Gayathri Hotel Lift issue in Warangal : వరంగల‌్‌లోని గ్రాండ్ గాయత్రి హోటల్‌లో ఓ వ్యక్తి లిఫ్టులో ఇరుక్కుపోయాడు.హోటల్లో పని కోసం వచ్చిన అంజి అనే కార్మికుడు ప్రమాదవశాత్తు లిఫ్టు ఊడిపోయి కిందపడడంతో అందులో చిక్కుకున్నాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న గ్రాండ్ గాయత్రి హోటల్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సురక్షితంగా బయటకు : పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ముందుగా లిఫ్టు కింది భాగంలో గోడకు పెద్ద సైజులో రంధ్రం చేశారు. ఫైర్ సిబ్బంది అంజికి ధైర్యం చెబుతూ అతనికి గాలి తగిలేలా తాత్కాలికంగా ఒక ఫ్యాను ఏర్పాటు చేశారు. అనంతరం మరో వైపు గోడకి రంధ్రం చేసి అంజి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా సురక్షితంగా బయటకు తీశారు. దీంతో హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కార్మికున్ని 108 వాహనంలో కార్మికున్ని వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు బాధితుడికి ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. హోటల్ నిర్వాహకులపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.