Daughter Taking Care Mother : అందరి పిల్లలాగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి తల్లికే అమ్మగా మారి సేవలు చేస్తుంది. అమ్మ చేతి ముద్దలు తినాల్సిన చిరుప్రాయంలో అమ్మకే అన్నం కలిపి పెట్టాల్సిన పరిస్థితి. విధి ఆడిన వింత నాటకం ఏ చిన్నారికీ రాని కష్టమిది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం అధికారులు ఈ చిన్నారి ఇంటికి వెళ్లారు. అమ్మ నిలబడలేదంటూ ఇంటి ముందు నేను నిలబడతా నన్ను ఫోటో తీసి ఇల్లు ఇప్పించాలంటూ వేడుకుంది. దీంతో ఈ చిట్టితల్లితో పాటు ఆ కుటుంబ దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
అమ్మకు సేవలు చేస్తూ బడికి : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సయ్యద్ పాషా, సలీమా దంపతులకు కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వాన సంతానం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో కుమారుడు ఏడో తరగతి, కుమార్తె ఐదో తరగతి చదువుతున్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగగా క్షణికావేశంలో సలీమా ఒంటికి నిప్పంటించుకుంది.
కాలిన శరీర భాగాలు : దీంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. శరీరం మొత్తం కాలిపోవడంతో కొన్నాళ్లు ఆమె మంచానికే పరిమితమైంది. తర్వాత కొన్నాళ్లకు భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ భారాన్ని మోసే బాధ్యత ఆమెపైనే పడింది. కాలిన గాయాలతోనే కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషించింది. కాని గత కొంతకాలంగా కాలిన శరీర భాగాలు బిగుసుకుపోయి కాళ్లు, చేతుల నరాలు పనిచేయకపోవడంతో ఆమె కనీసం నిలబడలేక పోతుంది. ఆమె పనికి వెళ్లక పూట గడవడమూ కష్టమైంది. పండుగల సమయంలో సాటి ముస్లింలు, ఇతరులు అందించే చేయూత, దాతల సహకారంపైనే ఆ కుటుంబం ఆధారపడుతుంది.
చేతివేళ్లు కాలిపోవడంతో ఫించన్ రావట్లేదు : అప్పట్నుంచి పదేళ్ల కుమార్తె అమ్మ బాధ్యతలు తీసుకుంది. సలీమాకు తల్లిగా మారింది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేస్తూనే వంటచేసి తల్లికి తినిపించిన తర్వాత బడికి వెళ్తోంది. దాతలు సహకరించి అమ్మకు వైద్యం చేయిస్తే కష్టాల నుంచి బయటపడతామంటూ రిజ్వాన వేడుకుంటోంది. అమ్మ దివ్యాంగుల పింఛనుకు అర్హురాలని కాని సదరం ధ్రువీకరణకు స్లాట్ బుక్ చేసుకోవాలంటే వేలిముద్రలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారని చిన్నారి తెలిపింది. చేతివేళ్లు కాలిపోవడంతో వేలిముద్రలు పడడంలేదని దీంతో పింఛను రావట్లేదని ఆ చిన్నారి కన్నీరు పెట్టుకుంది. తనకు పింఛను, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తే బిడ్డలకు ఆసరా అవుతోందని సలీమా చేతులు జోడిస్తూ వేడుకుంటుంది.
సీఎం రేవంత్‌రెడ్డి స్పందన :'అమ్మకు అమ్మయింది..కదిలిస్తే కన్నీటి చెమ్మయ్యింది' కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సలీమాకు వైద్య సహాయం చేసి, పింఛను ఇవ్వాలని తాజాగా సీఎం అధికారులను ఆదేశించారు. సలీమాకు ఇందిరమ్మ ఇల్లుతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించాలని అన్నారు. దీంతో వెంటనే సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట కలెక్టర్‌తో చర్చించారు.