Minister Ponnam Congratulates to Woman Conductor : ఆర్టీసీ బస్సులో ఓ నిండు గర్భిణీ మహిళకు ప్రసవం చేసిన సిబ్బంది, మహిళా ప్రయాణికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ బహదూర్‌పురలో టీజీఎస్ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి మహిళకు ప్రసవం చేసిన ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ, మహిళా ప్రయాణికులను ప్రశంసించారు.
చక్కటి సమయస్పూర్తితో వ్యవహరించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అన్నారు. వారికి సరైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సామాజిక సేవలో ఆర్టీసీ సిబ్బంది ఉండటం అభినందనీయం అని మంత్రి పొన్నం కితాబు ఇచ్చారు.
TGSRTC MD Sajjanar Tweet on Women Delivers in Bus : మరోవైపు, టీజీఎస్ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్నార్ "ఎక్స్" వేదికగా స్పందించారు. మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారని కొనియాడారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1Z రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ మహిళ ఆరాంఘర్‌లో ఎక్కారు. ఆ ఆర్టీసీ బస్సు బహదూర్‌పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.
ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమయి, సాటి మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు.
" టీజీఎస్ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై, మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. వారందరికీ నా అభినందనలు"- వీసీ సజ్జనార్ ఎక్స్ పోస్ట్