Wine Shops Close in Nirmal District : రాష్ట్రవ్యాప్తంగా దసరా సంబురాల వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గతరాత్రి సద్దుల బతుకమ్మ పూలపండుగ సందడిగా సాగగా, శనివారం విజయ దశమి ఘనంగా జరగనుంది. రాష్ట్రంలో దసరా పండుగ అంటే కచ్చితంగా మందు, మాసం ఉండాల్సిందే. సుక్క లేనిదే వేడుకకు కిక్కు ఉండదు. కానీ ఆ జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖా అధికారులు వారికి కిక్కు దించే సమాచారం అందించారు. దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా పోలీస్, ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్, ముధోల్లో 12 వ తేదీ (శనివారం) ,13 వ తేదీ (ఆదివారం) భైంసాలో దుర్గాదేవి నిమజ్జనం, రావణ దహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి 14 వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. గత వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తలెత్తిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, శాంతి భద్రతల పరిరక్షణకై ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
"దసరా అమ్మవారు నిమజ్జనం, రావణ దహనం కార్యక్రమాల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో వైన్ షాప్స్ అన్నీ బంద్ చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే భైంసా పట్టణంలో రేపు ధర్మచక్రపరివర్తన నిమజ్జనం, ఆదివారం అమ్మవారి నిమజ్జనం ఉంది. అక్కడ కూడా రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉంటాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పూర్తి బందోబస్తు చేశాం."-జానకి షర్మిల, ఎస్పీ