Wife Fight for Husband Property : ఆస్తి కోసం దహన సంస్కారాలు ఆగిపోయిన విషాద సంఘటన మంథనిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే పెద్దపెల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నగరానికి చెందిన సంధ్య అనే యువతితో సునీల్‌కు వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు.
అనారోగ్యంతో మృతి : ఈ నేపథ్యంలో మద్యానికి బానిసైన సునీల్, మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మంథని గోదావరినది వద్దకు దహన సంస్కారాల కోసం తీసుకువచ్చారు.
ఆస్తి కోసం అంత్యక్రియల అడ్డగింత : మృతుని భార్య సంధ్య మంథనికి వచ్చి సునీల్ దహన సంస్కారాలు కాకుండా అడ్డుకుంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆస్తి వ్యవహారాల గొడవలతో దహన సంస్కారాలను అడ్డుకోవడంతో స్థానికులు, అధికారులు ఎంత నచ్చ చెప్పిన సంధ్య వారి కుటుంబ సభ్యులు వినలేదు. సుమారు రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డున సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం వేచి చూశారు.