Using Adulterated Palm Oil in AP and Telangana :ఇంట్లో పోపు పెట్టాలన్నా, ఏ కూరైనా రుచిగా ఉండాలన్నా, గారె వేయించాలన్నా, అట్టు వేయాలన్నా వంట నూనెతోనే కదా. మరి ఆ నూనెలో నాణ్యత లేకపోతే? అనేక ప్రమాదకర వ్యాధులకు అదే ప్రధాన కారణమైతే? ఊహించుకుంటేనే వామ్మో అని అనిపిస్తోంది కదా. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా కల్తీ నూనె అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లూజు విక్రయాలతో జనం ఆరోగ్యం గుల్ల అవుతోంది. కొన్ని రోజులుగా మార్కెట్లో నూనెల ధరలు పెరిగిపోవడంతో కల్తీరాయుళ్లకు కలిసొచ్చింది. ఎక్కువ మంది వినియోగించే పామాయిల్‌ను కల్తీ చేసి జనానికి అంటగడుతున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ వినియోగం ఎక్కువ. అయితే కేంద్రం దీనిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ధరలు బాగా పెరిగాయి. పామాయిల్ 910 గ్రాముల ప్యాకెట్ రూ.129 ఉండగా, లూజుగా కిలో రూ.145 వసూలు చేసి అమ్ముతున్నారు. పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్ రూ.135కాగా లూజుగా రూ.155కు, వేరుశనగ నూనె ప్యాకెట్ రూ.150 ఉండగా లూజుగా రూ.154కే అమ్ముతున్నారు. ఎక్కువ మంది వినియోగించే పామాయిల్లో తక్కువ ధరకు వచ్చే నూనెలను కలిపి కల్తీ చేసి టోకు వర్తకులు చిల్లర వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఏపీలోని నరసరావుపేటలో కొన్ని మిల్లుల్లో నాసిగా, తేమతో ఉన్న వేరుశనగ పప్పు, పత్తి గింజల నుంచి నూనె తీసి టోకు డీలర్లకు విక్రయిస్తున్నారు.
పామాయిల్‌తో పోలిస్తే కిలో రూ.20 నుంచి రూ.30 వరకు తక్కువ ఇస్తున్నారు. నరసరావుపేటలో ఓ వ్యాపారి గతంలో నాణ్యత తక్కువగా ఉన్న నూనె పీపాలను నెలకు 100 నుంచి 150 వరకు విక్రయించేవారు. ప్రస్తుతం దాదాపు 1000 నుంచి 1500 వరకు అమ్ముతున్నారు. నాసిరకం వేరుశనగ, పత్తిగింజల నూనెలు గుంటూరుకు దిగుమతవుతున్నాయి. వీటినే పామాయిల్లో కలిపేస్తున్నారు. కళాయిలో కల్తీ నూనె వేడి చేసి ఆహార పదార్థాలు వేయగానే అది పొంగి కిందకు పోతోంది. సాధారణంగా తిను బండారాలు నెల వరకు నిల్వ ఉంటాయి. కానీ కల్తీ నూనె వల్ల వారం రోజులకే నూనె వాసన వస్తుండటంతో తినుబండారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.