Warangal Man Selected For ISRO Tutor :ఇస్రోలో(భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ)లో మహామహులైన శాస్త్రవేత్తలు ఉంటారు. మన దేశ అంతరిక్ష పతాకను అంతర్జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దిగ్గజాలు ఆ సంస్థలో పని చేస్తారు. అంతటిమహామహులతో కలిసి పని చేయడమంటే మాటలా? కానీ ఆ ఘనత అందుకున్నాడు తెలంగాణ కుర్రాడు శశాంక్ భూపతి. ప్రధాని మోదీ ప్రశంసలు సైతం పొందిన ఈ యువకెరటం గురించి తెలుసుకుందామా?
స్పేష్ ట్యూటర్‌గా ఎంపికైన శశాంక్ :ఇస్రోలో(భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ట్యూటర్ అవకాశం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దరఖాస్తులొచ్చాయి. అనేక వడపోతల అనంతరం తెలుగు రాష్ట్రాల(ఆంధ్ర, తెలంగాణ) నుంచే కాక దక్షిణాది నుంచి ఎంపికైంది శశాంక్ మాత్రమే. అతడి ఆర్కిటెక్ట్ కంపెనీ ‘ఏన్షియెంట్ టెక్నాలజీ డిజైన్ రిసెర్చ్ ల్యాబ్’ ప్రతిభకు మెచ్చి ఈ అవకాశం కల్పించారు. ఈ కంపెనీ ఇస్రో సహకారంతో దేశంలోని వివిధ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్, అన్ని వర్గాల వారికి అంతరిక్షం పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తుంది.
ఇస్రో చేసేటువంటి రీసెర్చ్‌కు సహాయ సహకారాలు అందించే బాధ్యతను స్పేస్ ట్యూటర్‌లు తీసుకుంటారు. వీరు స్పేస్‌లోకి వ్యోమగాములను తీసుకెళ్లేటువంటి రాకెట్లను డిజైన్ చేస్తారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మౌలిక వసతులు ఉండేవిధంగా చూస్తారు. స్పేస్‌లోకి వెళ్లిన తర్వాత 4 ఏళ్ల పాటు అన్ని వసతులూ ఉండేలా దీనిని రూపొందిస్తారు.
అలా మొదలైంది :హనుమకొండ ప్రాంతానికి చెందిన శశాంక్‌కి చిన్నప్పట్నుంచి అంతరిక్షం, ఆకాశం అంటే అమితమైన ఆసక్తి. తండ్రితో కలిసి బైక్‌పై రాత్రి వెళ్లేటప్పుడు ‘చందమామ మన వెనకాలే ఎందుకు వస్తోంది? ‘వర్షం పైనుంచే ఎందుకు పడుతోంది?’లాంటి ప్రశ్నలతో నాన్నను విసిగించేవాడు. ఏదైనా కొత్త విషయం తెలిస్తే దాని అంతు చూసేదాకా విడిచిపెట్టేవాడు కాదు. ఇక ఓరుగల్లు(వరంగల్) అంటేనే పురాతనమైన కట్టడాలకు ప్రఖ్యాతి. ఓరుగళ్లులోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, కాకతీయుల కోటలను శశాంక్ తరచూ సందర్శిస్తుండేవాడు.