Theft For Online Games :ఆన్లైన్ గేమ్లకు బానిసైన ఓ వ్యక్తి చివరకు దొంగగా మారాడు. ఓ వైపు వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తూనే అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయం చూసి ఓ రైతు ఇంటి తాళం పగులగొట్టి రూ.2.10 లక్షల నగదుతో పాటు రెండున్నర తులాల బంగారాన్ని తస్కరించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : రేగోడు మండల పరిధిలోని ముక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే త్వరగా అధిక డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా వినిపించుకోలేదు.
కుటుంబ సభ్యులకు తెలియకుండా కొంతమేర అప్పు చేశాడు. అప్పు తీర్చడానికి చోరీ చేయడాన్ని మార్గంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 22న తన సొంత గ్రామంలో ఎన్.సంగప్ప అనే రైతు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి తాళం పగలగొట్టి 2 లక్షల పదివేల రూపాయల నగదు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.