Seasonal Diseases in Telangana : ఏటా వర్షాకాలం ప్రారంభవుతుందంటే ఆస్పత్రులకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధితులు క్యూ కడుతుంటారు. ఇక ఈ సారి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లతో పాటు డెంగీ, మలేరియాలు పంజా విసురుతున్నాయి. వర్షంతో పాటే వ్యాధులు ముసురుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల ప్రజలపై సీజనల్ వ్యాధులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. డెంగీతో పాటు ఈసారి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇక జీహెచ్ఎంసీ వ్యాప్తి అంతకంతకూ తీవ్రమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,084 మంది డెంగీ బారినపడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక వీరిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 382 మంది ఉండగా ఇతర జిల్లాలకు చెందిన వారు 506 మంది ఉన్నారు. మరో 196 మంది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి జీవనం సాగిస్తున్నారు. దీంతో వారు ఏ జిల్లాలో డెంగీ బారినపడినా ఇతర రాష్ట్రాల వారిగా డేటా నమోదు చేస్తున్న పరిస్థితి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో డెంగీ కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అధికంగా సీజనల్ ఫీవర్ బాధితులు : జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీతోపాటు సీజనల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది. డయోరియా, ఫీవర్లు, రెస్పిరేటరీ సమస్యలతో నగరవాసులు ఊపిరి తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు, ఇన్ ఫ్లుయెంజా కేసులు ఈ సారి మరింత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. దాదాపు 20వేల మంది ఈసారి ఈ తరహా సమస్య బారిన పడటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఒక్క జులైలోనే 1,200 మందికి పైగా ఈ సమస్య బారినపడ్డారు. ఇక ఈ ఏడాది సీజనల్ ఫీవర్ బాధితులు అధికంగా ఉన్నారు.