Hyderabad Boy Vishwanath Karthikeya Climbed Over Twenty Mountains : సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అయితే, సొదరి స్ఫూర్తితో మౌంటెనీరింగ్ వైపు అడుగులేశాడా కుర్రాడు. క్రమంగా పర్వతారోహణ హాబీగా మలచుకుని అనతి కాలంలోనే అందులో పరిణతి చెందాడు. 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలు అధిరోహించి ఔరా అనిపించాడు. అంతేకాదు, 4 ఏళ్ల వ్యవధిలోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ మౌంటెనీర్ ఎవరు? సాధించిన ఘనతలు ఏంటో మనమూ చూసేద్దామా?
ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు : సమయస్ఫూర్తి, సంయమనం ఉంటే తప్ప ఎత్తయిన పర్వతాలు అధిరోహించడం అంత తేలిక కాదు. అలాంటిది చిన్న వయసులోనే పర్వతారోహణలో పరిణతి చెంది ఎత్తయిన కొండలు సులభంగా ఎక్కెస్తున్నాడీ కుర్రాడు. ఫలితంగా 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలు అధిరోహించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
పర్వతారోహణపై మక్కువ : హైదరాబాద్ బాలానగర్‌లోని ఫిరోజ్‌గూడకు చెందిన పడగంటి రాజేందర్‌ప్రసాద్, లక్ష్మీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయ. ప్రస్తుతం ఇంటర్ మొదటి చదువుతున్నాడు. బాల్యం నుంచి కష్టం అంటే ఎంటో తెలియకుండా పెరిగాడు. అయితే, కార్తికేయ సోదరి ఉత్తరాఖండ్‌లోని రుదుగైరా పర్వతారోహణకు వెళ్లింది. తనతో పాటు కార్తికేయనూ తీసుకెళ్లింది. అప్పటి నుంచి పర్వతారోహణపై మక్కువ పెంచుకున్నాడీ కుర్రాడు.
6 ఖండాల్లో 20కి పైగా : 2020లో పర్వతారోహణ ప్రారంభించాడు కార్తికేయ. నార్త్ అమెరికాలోని డెనాలి, యూరప్‌లోని ఎల్‌బ్రూస్, ఆఫ్రికాలోని కోసీజ్‌కో, భారత్‌లోని కాంగ్‌ఎట్‌సీ 1, 2, ఫ్రెండ్‌షిప్ పీక్, నేపాల్‌లోని ఐస్‌ల్యాండ్‌పీక్ అధిరోహించాడు. వీటితో పాటు సౌత్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ సహా మొత్తం 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలు అధిరోహించి ఔరా అనిపిస్తున్నాడు.
మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు సిద్ధం : నాలుగేళ్ల వ్యవధిలోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడీ పర్వతారోహకుడు. ప్రస్తుతం మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఎవరెస్టు అధిరోహిస్తే 7 ఖండాల్లో 7 ఎత్తయిన పర్వతాలు ఎక్కిన పిన్న వయస్కుడిగా నిలవనున్నాడు. మలావత్ పూర్ణ తర్వాత ఎవరెస్టు ఎక్కిన రెండో పిన్నవయస్కుడి గానూ రికార్డుకెక్కనున్నాడీ యంగ్ మౌంటెనీర్.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే పర్వతారోహణ : 2022 ఆగస్టు 15న యూరప్‌లోని ఎల్‌బ్రూస్ పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగర వేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని చెబుతున్నాడీ మౌంటెనీర్. ఆ పర్వతాన్ని ఈస్ట్, వెస్ట్ రెండు వైపుల నుంచి కేవలం 24 గంటల్లోనే అధిరోహించి మరో రికార్డు నెలకొల్పాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే పర్వతారోహణలో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు కార్తికేయ.
మోటివేషనల్ స్పీకర్‌గానూ : పర్వతారోహణతో పాటు వెయిట్ లిఫ్టింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడీ యువకుడు. అంతే కాకుండా పాఠశాలలు, కళాశాలల్లో ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం తదితర అంశాలపై విద్యార్థులకు తరగతులు చెబుతూ మోటివేషనల్ స్పీకర్‌గానూ ఎదుగుతున్నాడు.
ఓవైపు చదువు, మరోవైపు మౌంటెనీరంగ్ : చిన్నవయసులోనే ఎత్తయిన పర్వతాలను అదిరోహిస్తున్న కార్తికేయ పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు చదువు, మరోవైపు మౌంటెనీరంగ్‌ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెబుతున్నారు.
దేశానికి సేవచేయడమే లక్ష్యం : ఆత్మ విశ్వాసం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు విశ్వనాథ్ కార్తికేయ. ప్రస్తుతం ఎవరెస్టు అధిరోహించడం కోసం కఠోర సాధన చేస్తున్నాడు. భవిష్యత్‌లో త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవచేయడమే లక్ష్యమని చెబుతున్నాడీ యంగెస్ట్ మౌంటెనీర్.
మౌంట్ కాంగ్ యాట్సే 2 పర్వతాన్ని అధిరోహించిన మహబూబాబాద్ యువకుడు - Mountaineer Bhukya Yashwanth