Villagers Suffering From Seasonal Diseases :వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ ఊరిలోని ప్రతి ఇళ్లూ మంచం పట్టింది. కుటుంబంలో ముగ్గురు, నలుగురు జ్వరాల బారిన పడ్డారు. భరించలేని ఒళ్లు నొప్పులతో కాలు కదపలేని స్ధితిలో మంచానికే అతుక్కుపోయారు. వైద్య శిబిరాలు పెట్టి చికిత్స అందిస్తున్నా కోలుకోవడం లేదు.
Rising Cases Of Fever :హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామం మొత్తం మంచం పట్టింది. ఊరిలో 130 మంది జ్వరం బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నా అది రెట్టింపు సంఖ్యలో విజృంభిస్తోంది. గ్రామంలో ఎవరిని కదలించినా జ్వరంతో బాధపడుతున్నామనే సమాధానం వస్తోంది. జ్వరం కాస్త తగ్గిందనుకునేలోగా భరించలేని కండరాల నొప్పులతో కదలలేక పోతున్నామని వాపోతున్నారు. ఏ పని చేసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నాని ఆవేదన చెందుతున్నారు.
'గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాం. నొప్పులతో కూడిన జ్వరాలు వస్తున్నాయి. దీంతో మా పనులు చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ట్యాబ్లెట్లు వేసుకున్నతర్వాత తగ్గినట్టే తగ్గి మళ్లీ జర్వాలు వస్తున్నాయి' అని బాధితులు చెబుతున్నారు.
ఒక్కొక్కరిగా జ్వరం బారిన పడుతున్న ప్రజలు :ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ జ్వరం బారిన పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మందులిచ్చినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వేలల్లో ఖర్చు చేసినా చేతులు, కాళ్ల నొప్పులు పోవడం లేదంటున్నారు. జర్వాలు నెలరోజుల నుంచి ప్రబలుతున్నా గత వారంలో విపరీతంగా కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.