Vijayawada Young Woman ShailuTalent in Table Tennis: బాల్యమంతా క్రీడా మైదానంలోనే గడిపిందీ యువతి. రెండో తరగతిలోనే టేబుల్ టెన్నిస్ ఆటడం మొదలు పెట్టింది. ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ఆహర్నిశలు శ్రమించింది. ఫలితంగా జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకాలతో పాటు స్పోర్ట్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది.
ఈ యువతి పేరు శైలు నూర్ బాషా. విజయవాడ స్వస్థలం. తల్లి ఆశాబి, తండ్రి ఖాళీం నూర్ బాషా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ గ్రౌండ్‌మెన్‌గా చేస్తూ అక్కడే నివసించేవారు. దీంతో చిన్నప్పటి నుంచి మైదానానికి వచ్చే ఆటగాళ్లతో పరుగులు పెట్టేది శైలు. అలా ఆటలపై ఆసక్తి పెంచుకుంది.
కుమార్తెకు ఆటలపై ఉన్న ఆసక్తి గుర్తించిన ఖాళీం ఎలాగైనా ఈమెను క్రీడాకారిణిగా చూడాలనుకున్నాడు. రెండో తరగతిలో చదువుతున్నప్పుడే టెబుల్ టెన్నిస్‌లో శిక్షణ ఇప్పించాడు. 2006లో టెన్నిస్ క్రీడ ప్రారంభించిన శైలు 2008లోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకుని ఔరా అనిపించింది.
రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన శైలు జాతీయ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2010లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 100 పతకాలు, జాతీయస్థాయిలో 15 పసిడి పతకాలు సహా 50 పతకాలు కైవసం చేసుకున్నట్లు చెబుతోందీ టెన్నిస్ క్రీడాకారిణి.