Finable Loan App Harassment : ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కేసు వివరాలను మీడియాకు తెలిపారు. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందట ఫినబుల్ యాప్‌లో లోన్ తీసుకుంది.
లోన్‌యాప్ బెదిరింపులా? - ఇలా రక్షించుకోండి!
ఈ క్రమంలో సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేగాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి వేధించారు. లోన్ తాలూకూ డబ్బులు చెల్లించడం లేదంటూ దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి మార్ఫింగ్ చేసిన కొన్ని న్యూడ్ ఫొటోలు కూడా పంపించడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఎంత వారించినా ఏజెంట్లు వినకపోవడం, బెదిరింపులు పెరుగుతుండడంతో ఏజెంట్ల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. ప్రజలు సైబర్ నేరాల లోన్ యాప్ బెదిరింపులపై అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్తూ యువతిని వేధించిన ఫినబుల్ లోన్ యాప్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని చెప్పారు.
భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు! - యువకుడి ప్రాణం తీసిన 2 వేలు
ఏపీలో "లక్కీ భాస్కర్లు" - నకిలీ పత్రాలతో మార్టిగేజ్ ఆస్తుల అమ్మకం