AP New CS : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరనేది అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. సాయిప్రసాద్ పేరు ఎక్కువగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారని కచ్చితంగా చెప్పలేమని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
విజయానంద్‌కంటే సాయిప్రసాద్‌కు ఎక్కువ సర్వీసు ఉన్నందున తొలుత విజయానంద్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించి, ఆయన పదవీకాలం ముగిశాక సాయిప్రసాద్‌ను ఎంపికచేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత ఆయనకు మరింత కాలం పొడిగింపు ఇస్తారన్న అభిప్రాయం అధికార వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విజయానంద్ వచ్చే సంవత్సరం నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. సాయిప్రసాద్‌కు 2026 ఏప్రిల్ నెలాఖరు వరకు సర్వీసు ఉంది.
AP Govt Focus on Next CS : మరోవైపు సీనియారిటీ ప్రకారం వీరే కాక మరో ఆరుగురు పేర్లు వినిపించాయి. సీనియారిటీ ప్రకారం వివాదాస్పద అధికారి శ్రీలక్ష్మి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇతర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉన్నారు.
వీరి ఐఏఎస్‌ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఉన్న వారిలో సీనియర్. శ్రీలక్ష్మి తర్వాత సీనియర్‌గా 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనంత్ రామ్. ఆ తర్వాత జి.సాయిప్రసాద్, ఆర్పీ సిసోదియా, అజయ్ జైన్, సుమితా దావ్రా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. బుడితి రాజశేఖర్, కె.విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. ఈ లెక్కన ముందుగా పదవీ విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్ ఉండగా ఆ తర్వాత వరుసలో సాయిప్రసాద్, సిసోదియా ఉన్నారు.