Heavy Traffic at Araku Ghat Road : భూతల స్వర్గంగా పేర్కొనే విశాఖ జిల్లాలోని అరకు ప్రాంతం పర్యాటకులతో రద్దీగా మారుతోంది. ఆంధ్ర ఊటీగా కీర్తి గడించిన అరకు లోయలో ఇటీవల కాలంలో పర్యాటకులు భారీగా వస్తుండటంతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి అరకు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకు లోయ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. వచ్చే పోయే వాహనాలులతో ఘాట్ రోడ్డు రద్దీగా మారతుండటంతో స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. దీంతో పాటుగా కాఫీ తోటల వద్ద ఏర్పాటు చేసిన ఉడెన్ స్టెప్స్ వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలు రహదారిపైనే నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 300 వరకు వాహనాలు బారులు తీరాయి. అరకు లోయ విశాఖ మధ్య రాకపోకలు సాగించేందుకు మూడున్నర గంటల సమయం కాగా ట్రాఫిక్ రద్దీతో ఐదు గంటలు సమయం పడుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం కావడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస సెలవులు కావడంతో అరకు లోయకి సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు.
పర్యాటకులకు పండగే - అరకు సందర్శకులకు ప్రత్యేక రైళ్లు
రైల్వే సేవలు ఉపయోగించుకోండి : అరకు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నంలో బయలు దేరి ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ కమ్ లగేజీ బోగీలతో ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు ఆయన తెలిపారు. పర్యాటకులు గమనించి ఈ రైలు సేవలు ఉపయోగించుకోవాలని సందీప్ కోరారు.
ఏజెన్సీలో సుందర మనోహర దృశ్యాలు - ఏ మూల చూసినా అద్భుతమే
అరకు, మారేడుమిల్లిలో ఉత్సవాలు - ఆ వస్తువులపై నిషేధం విధించిన ప్రభుత్వం