Single Use Plastic Ban in GVMC : దైనందిన జీవితంలో ప్లాస్టిక్ అంతర్భాగమైపోయింది. దీని వాడకంతో అనేక ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా వినియోగించడం మాత్రం ఆపరు. విచ్చలవిడిగా పెరిగిన ప్లాస్టిక్ వినియోగంతో భూమి, నీరు కలుషితమవుతూ జంతు జీవజాలానికి నష్టం కలిగిస్తోంది. పుడమికి హాని తలపెట్టే ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తుల్ని సమర్థంగా అరికట్టాలి. లేదంటే రేపటి తరం భయానక ముప్పు బారినపడే ప్రమాదం ఉంది. తాజాగా విశాఖలో ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించనున్నారు.
జీవీఎంసీ పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్‌తో కలసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై ప్రత్యామ్నాయాలు, తనిఖీలపై స్కిల్ అప్ గ్రేడేషన్‌పై సమీక్ష నిర్వహించారు. వీధి వ్యాపారులు, వర్తక, వ్యాపారస్తులు అలాగే అన్ని జోన్ల కార్యదర్శులతో జూమ్ యాప్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా అనేక వస్తువులు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి సూచించారు. మార్కెట్లు, రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు మేయర్‌కి వివరించారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల లోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులివే : కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్, ప్లేట్లు, పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్‌లు, పిప్పర్‌మెంట్లకు వాడే పుల్లలు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు ఉన్నాయి. అదేవిధంగా కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్స్‌ల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 120 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు మొదలైనవి.
భయానక వ్యాధులకు మూలం ప్లాస్టిక్ - ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న శివాజి
ప్లాస్టిక్ బాటిళ్లతో సింథటిక్ నూలు ఉత్పత్తి, విదేశాలకు ఎగుమతి, తక్కువ ఖర్చుతో తయారీ