YSRCP Leaders Joined Janasena: వైఎస్సార్సీపీని మరో ఇద్దరు నేతలు వీడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మంగళగిరి సీటు ఆశించి: గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించి భంగపడ్డ గంజి చిరంజీవి అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురు చూశారు. ఆ పదవిని తాడేపల్లి నేత వేమారెడ్డికి అప్పగించడంతో చిరంజీవి అలక పూనారు. ఈ నేపథ్యంలో సోమవారం తన భార్యతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో బలమైన నేత: మరోవైపు కైకలూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన జయమంగళ రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శిష్యుడిగా కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన అనూహ్యంగా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకుని కామినేనిపై విజయం సాధించారు. ఇక 2014 పొత్తుల్లో భాగంగా కామినేని శ్రీనివాస్ కోసం తన సీటు త్యాగం చేసి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానే కొనసాగారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా టిక్కెట్టు ఇచ్చినా ఓటమి పాలయ్యారు. రెండు దశాబ్దాలుగా టీడీపీకి సేవలందించిన జయమంగళ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఉహించని విధంగా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైకాపా గూటికి చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు.
వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచి విభేదాలే: వైఎస్సార్సీపీ చేరిన తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి అప్పటి జయమంగళ వెంకటరమణను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దూరం పెడుతూ వచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నేతలను తనను కలవకుండా చేశారని, తన అభిమానులపై దాడులు చేయించి కేసులు పెట్టించారని జయమంగళ వెంకటరమణ స్వయంగా ఆరోపించడం గమనార్హం.
గతంలోనే ప్రచారం: జనసేనలోకి జయమంగళ వెళ్తున్నారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. కైకలూరు వంటి రాజకీయ ప్రాధాన్యమున్న నియోజకవర్గంలో జనసేనకు బలమైన నాయకత్వం లేదు. జనసైనికులే అన్నీ తామై పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. జయమంగళ చేరికతో పార్టీకి రెండింతల బలం చేకూరినట్లైంది.
"గుడ్ బై జగన్" - వలసబాటలో వైఎస్సార్సీపీ నేతలు
'ప్రజాతీర్పును జగన్ గౌరవించకపోతే ఎలా?' - వైఎస్సార్సీపీకి మరో ఇద్దరు గుడ్ బై