Union Budget 2025 : డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదానికి అనుగుణంగానే ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి కేంద్ర పద్దులో వరుసగా రెండో ఏడాదీ కేటాయింపులు దక్కాయి. బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు గత సంవత్సరం కన్నా రూ.242 కోట్లు అదనంగా మొత్తం రూ.5936 కోట్లు కేటాయించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇంత మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు పరుగులు పెట్టిచేందుకు ఉపయోగపడుతుంది.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ కూడా అనూహ్యంగా పెరిగింది. 2024-2025 పద్దులో తొలుత కేవలం రూ.620 కోట్లు కేటాయించిన ఉక్కుశాఖ ఆ అంచనాలను రూ.8622 కోట్లకు సవరించింది. ఇక 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.3295 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం ఈ రెండేళ్లలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,917 కోట్లు ఇచ్చినట్లైంది ఇందులో రూ.11,418 కోట్లు బడ్జెటరీ సపోర్టు కాగా రూ.499 కోట్లు అంతర్గత బడ్జెటరీ సపోర్ట్ ద్వారా ఇస్తారు.
పోలవరం, విశాఖ ఉక్కు మినహా తాజా కేంద్ర బడ్జెట్‌లో నేరుగా ఏపీకి భారీ కేటాయింపులేమీ చూపించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి, మన అవసరాల్ని వివరించి, కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా పద్దులో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల నుంచి మెజారిటీ వాటా రాబట్టుకోవచ్చు. దీనికి విశాఖ ఉక్కు ప్యాకేజీయే నిదర్శనం. గత బడ్జెట్‌లో చూపించకపోయినా స్టీల్ ప్లాంట్‌కూ ఇటీవల రూ.11,418 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.
Union Budget Allocations for AP : ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో 2024-2025 బడ్జెట్ సవరించిన అంచనాల్లోనే విశాఖ ఉక్కుకు రూ.8423 కోట్లను కేంద్రం చూపించింది. ఈ పద్దులో మిగతా రూ.2995 కోట్లు ప్రతిపాదించింది. ఇంటింటికీ కుళాయిద్వారా నీరు అందించేందుకు రూ.70,000ల కోట్లతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వేళ 2024తో ముగిసిన జలజీవన్ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వం 2028 వరకు పొడిగించడం కూడా ఏపీ గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు వీలుంది.
పెద్ద రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీనే. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు తొలి దశలో రూ.22,000ల కోట్ల నిధులు కోరుతూ ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌లు పంపింది. గట్టిగా ప్రయత్నిస్తే నిధులు తెచ్చి మెట్రోను పట్టాలెక్కించవచ్చు. ఇక కొత్తగా 120 విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించడం, ఏడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లను అభివృద్ధి చేయాలనే చంద్రబాబు లక్ష్యసాధనకు ఉపకరించనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానిస్తూ విమాన సర్వీసులు నడిపేందుకు తెచ్చిన ఉడాన్ పథకాన్ని విస్తరించడం, పౌరవిమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడే ఉండటం కలిసొచ్చే అంశం.
గరిష్ఠ ప్రయోజనం పొందే వీలు : ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద రూ.3000ల కోట్లు, గ్రామీణ్ యోజన కింద రూ.1500 కోట్ల వరకూ తెచ్చుకునే వీలుంది. వీటితో పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.60 లక్షల గృహాలు పూర్తి చేసే వెసులుబాటు దక్కుతుంది. కొత్తగా అమల్లోకి రానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన-2.0కి కేంద్రం ప్రతిపాదించిన రూ.3500 కోట్లలో రూ.200 కోట్లు, పరిశ్రమల్లోని కార్మికుల కోసం తెచ్చిన ఇండస్ట్రీయల్ హౌసింగ్ పథకం నుంచి రూ.200 కోట్లు ఏపీకి దక్కే అవకాశముంది.
ఇక నౌకా వాణిజ్యానికి ఏపీని గేట్‌వేగా చంద్రబాబు మార్చాలనుకుంటున్న వేళ మారిటైం బోర్డుకు కేంద్రం రూ.25,000ల కోట్లు కేటాయించడం మెజారిటీ నిధుల సాధనకు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. ఇక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిర్మలమ్మ పద్దులో ప్రతిపాదించిన రూ.10,000ల కోట్ల నుంచి కూడా గణనీయంగా నిధులు తెచ్చుకోవచ్చు. రాష్ట్రాల పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పోలీస్, గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాల్లేని ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మార్చుకోవచ్చు. ఆ నిధులతో రాష్ట్రంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ అభివృద్ధి చేసుకోవచ్చు.
ఆ రుణాల్లో అత్యధిక వాటా! : ఇక కాటన్ టెక్నాలజీ మిషన్‌కు రూ.500 కోట్లు కేటాయించడం పత్తి సాగు, నూలు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి ఉపయోగం కానుంది. ధన్‌ధాన్య యోజన పథకం కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత రైతులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా పెరిగింది. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ.57,566 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది గత పద్దుతో పోలిస్తే దాదాపు రూ.7,000ల కోట్లు అదనం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50ఏళ్ల వరకూ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు పద్దులో లక్షన్నర కోట్లు ప్రతిపాదించింది. ఆ మేరకు రుణాలు తెచ్చుకోవడానికి అవసరమైన అర్హతల్ని ఏపీ ఇప్పటికే సాధించింది. గట్టిగా ప్రయత్నిస్తే ఎక్కువ లబ్ధి పొందే వీలుంటుంది.
బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత: సీఐఐ ప్రతినిధులు
కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి నిధులు - ఏపీకి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే?