Vijayasai Reddy Meets Sharmila : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశం కావడం వైఎస్సార్సీపీలో కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ, రాజకీయ సంబంధాలు సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పు, నిప్పులా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఆమెను కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు తావిస్తోంది. విజయసాయిరెడ్డిపై అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయి ప్రకటించడంపైనా అభ్యంతరం తెలిపారు.
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని వైఎస్ షర్మిల సూచించారు. ఆయన జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని, వైఎస్ జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసేవారని అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోతున్నారనీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో షర్మిలను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారు : విజయసాయిరెడ్డి
విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు: వైఎస్ షర్మిల