PM Internship Scheme Applications : యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తుల ప్రక్రియ ఇటీవల ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.27 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్న కేంద్ర ప్రభుత్వం, 6.21 లక్షల దరఖాస్తులు వచ్చాయని తాజాగా ప్రకటించింది.
'ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది'
ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ కొనుసాగుతోందని వెల్లడించింది. దాదాపు 6.21 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. దాదాపు 4.87 లక్షల మంది వ్యక్తులు తమ కేవైసీని పూర్తి చేసి పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని చెప్పింది.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్ చెల్లిస్తూ రాబోయే ఐదేళ్లలో టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.800 కోట్లు ఖర్చుతో ఇంటర్న్‌షిప్ మొదలుపెట్టనుంది.
నెలకు స్టైఫండ్ ఎంత?
నెలకు రూ.5,000: నెలవారీగా రూ.5,000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. కంపెనీలో చేరే ముందు ఇచ్చే రూ.6,000 (వన్‌టైం గ్రాంట్) కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక సంస్థలు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరొచ్చు.
బీమా సౌకర్యం ఉందా?
ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది.