PSLV C-60 Launch Was Successful: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Centre) నుంచి పీఎస్‌ఎల్వీ- సీ 60 నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటల 15 సెకండ్లకు నిప్పులు చిమ్ముతూ మొదటి ప్రయోగవేదిక నుంచి దూసుకెళ్లింది.
స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.
భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.
శాస్త్రవేత్తలను అభినందించిన ఛైర్మన్ సోమనాథ్: ప్రయోగం విజయవంతం అనంతరం ఛైర్మన్ సోమనాథ్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. వాహకనౌక ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందని సోమనాథ్ తెలిపారు. స్పేడెక్స్ శాటిలైట్లను ప్రవేశపెట్టడం మిషన్‌లో తొలి భాగమన్నారు. గంట 20 నిమిషాల తర్వాత రెండో దశ ఫైరింగ్ ఉంటుందని సోమనాథ్ అన్నారు.
వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - 'పోస్ట్ నో ఈవిల్'పై సినీ స్టార్స్