Kondaveedu Fort is Attracting Tourists in Palnadu District : రాజులు, రాజ్యాలు పోయినా వారి పాలన తాలూకు చారిత్రక ఆధారాలకు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి కోటలు. ఆ కాలంలోనే శత్రుదుర్భేద్యంగా నిర్మించిన బురుజులు, ప్రాకారాలు చూస్తుంటే అలాంటి కొండలు, గుట్టలపై నిర్మించడం ఇప్పటికీ అసాధ్యమేమో అనిపిస్తుంది. కోటలోపలే చెరువులు, ఆలయాలు, ఆయుధశాలలు, గుర్రపుశాలలు ఒక్కటేమిటి ఏది చూసినా అత్యద్భుతమే. రెడ్డిరాజుల పాలనలో ఒకప్పుడు విలసిల్లిన కొండవీడు కోట నేటికీ పర్యాటకులను, చరిత్రకారులను ఆకట్టుకుంటోంది.
సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తు : చుట్టూ ఎత్తైన కొండలు, ప్రకృతి పరవశిస్తున్నట్లు పచ్చని చెట్లు ఆ కొండలను కలుపుతూ చుట్టూ కోటగోడలు, చారిత్రక కొండవీడు రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. గుంటూరుకు అతి సమీపంలో పల్నాడు జిల్లాలో ఉన్న ఈ కొండవీడు కోట సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 44 బురుజులు, 32 ప్రాకారాలు మూడు అందమైన చెరువులు, రెండు ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాలలతో కొండవీటి రెడ్డిరాజుల వైభవాన్ని చాటుతోంది.
పర్యాటకులు కొండవీడుకు క్యూ : వారాంతాలు, సెలవులు వస్తే చాలు గుంటూరు పరిసర ప్రాంత వాసులతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు కొండవీడుకు క్యూ కడుతున్నారు. 14వ శతాబ్దం నాటి చారిత్రక కట్టడాలను చూసి మైమరిచిపోతున్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో కోండవీడును పర్యాటకంగా అభివృద్ధి చేశారు. కొండపైకి వెళ్లేందుకు రూ. 48 కోట్లతో ఘాట్‌రోడ్డు నిర్మించడంతోపాటు నగరవనం పేరుతో కోట పరిసరాలు అభివృద్ధి చేశారు. పర్యాటకులు సేదతీరేందుకు ఏర్పాట్లు చేశారు.
కొండపైనే మూడు చెరువులు : కొండచుట్టూ రాజుల కాలంలో నిర్మించిన రాతిగోడ, కోట బురుజులు, ఆలయాలు, అద్భుతమైన శిల్పాలు సందర్శకుల్ని అబ్బురపరుస్తున్నాయి. కోటలో నరసిహస్వామి గుడి, శివాలయాలు ఉన్నాయి. రెండు మసీదులు ఉండగా ఒకటి శిథిలమైంది. 44 బురుజులు, 32 ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, నేతికొట్టు, మసీదు, ఖజానా వంటి చారిత్రక ఆనవాళ్లు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాగునీటి అవసరాల కోసం కొండపైనే మూడు చెరువులు నిర్మించారు. ఇప్పటికీ నీటితో కళకళలాడుతున్న ఆ చెరువుల్లో బోటింగ్, కయాకింగ్ ఏర్పాటు చేశారు. అలాగే సాహస యువత కోసం ట్రెక్కింగ్, క్లైంబింగ్, హార్స్ రైడింగ్ అందుబాటులో ఉంచారు. చిన్నారుల కోసం నగరవనం అనే పిల్లల పార్కును సైతం అందుబాటులోకి తెచ్చారు.
కొండవీడు ఫెస్ట్ : కొండవీడును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు గత టీడీపీ హయాంలో కొండవీడు ఫెస్ట్ సైతం నిర్వహించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండవీడు కోటను పట్టించుకోకపోవడంతో సందర్శకుల తాకిడి కొంత తగ్గింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో తాగునీరు, మరుగుదొడ్లు, అల్పాహారం సహా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
సాగర తీరాన సమస్యల కెరటాలు - కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో వసతులు కరవు
గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!