Balotsavam in Vijayawada: చిన్నారుల కేరింతలు, ముద్దులొలికే మాటలు, అబ్బురపరిచే వేషధారణలు, ఉర్రూతలూగించే జానపద నృత్యాలతో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటో రియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవం మురిపించింది. రెండు రోజుల పాటు జరగనున్న బాలోత్సవంకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దాదాపు వివిధ పాఠశాలల నుంచి ఆరు వేల మంది విద్యార్థులు హాజరై వారి ప్రతిభ కనబరుస్తున్నారు.
సృజనాత్మకతను వెలికితీసేందుకు : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించడానికి నిర్వహించిన బాలోత్సవం కనులపండువగా ప్రారంభమైంది. చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాలలో 11వ బాలోత్సవం వేడుకకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దాదాపు వంద ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ఆరు వేల మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ వేషధారణలో పలు కళారుపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు.
'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు : కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ వేదికలపై వందలాది ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్రృతిక విభాగం, అకాడామీక్ విభాగాలు విభజించి పోటీలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు అందంగా అలంకరించుకుని ఆకట్టుకునే వేషధారణలో చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద పాటలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చేశారు. విద్యార్థులు కేరింతలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు తమలో ఇమిడివున్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడతాయని విద్యార్థులు చెబుతున్నారు. తొలిరోజున జానపద, శాస్త్రీయ నృత్యాలు, దేశభక్తి, అభ్యుదయ గీతాల ఆలాపన, ఏకపాత్రాభినయం, లఘనాటికలు, హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ తదితర పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రెండో రోజు వివిధ క్రీడల్లో పోటీలు జరగనున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఏటా బాలోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దోహదం చేస్తాయని అందుకోసం గత పదకొండు సంవత్సరాలుగా ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల్లో ప్రతిభాపాటవాలు కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు.
''ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జానపద, శాస్త్రీయ నృత్యాలు, దేశభక్తి, అభ్యుదయ గీతాల ఆలాపన, ఏకపాత్రాభినయం, లఘనాటికలు, హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ తదితర పోటీలన్నీ మాకెంతో ఆనందాన్ని కలుగజేశాయి. ఇవి మా జీవితంలో ఓ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి'' -విద్యార్థులు
'పుస్తక మహోత్సవం' రా రమ్మంటోంది.. పుస్తక ప్రియులు విజయవాడ వస్తున్నారా..!
మాతృభాషను ప్రేమించేలా విద్యార్థులను ప్రోత్సహిద్దాం: గవర్నర్