Women DWCRA Groups in AP : డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక ప్రగతికి నిచ్చెనలు. ఇప్పుడు ఈ సంఘాలు రాష్ట్రంలో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 8న మహిళా దినోత్సవం రోజు కోటి రూపాయలు విలువైన పొదుపు సంఘాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఒకేరోజు అమ్మి ప్రపంచ రికార్డు సృష్టించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. డ్వాక్రా మహిళల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు ఆలోచనతో అంకురించిన డ్వాక్రా సంఘాలు వేల కోట్లలో కార్యకలాపాలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లక్షలాది మంది మహిళలు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుని వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుని సమాజంలో గర్వించే స్థాయికి చేరారు. ప్రతిరోజూ వేల రూపాయల్లో లావాదేవీలు చేస్తూ ఆర్ధికంగా అభివృద్ది చెందుతున్నారు. ఈ కామర్స్ వేదికగా అమ్మకాలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గిరాకీ విపరీతంగా పెరిగింది.
AP Govt Guinness Record in SHG Groups : పొదుపు సంఘాలు సృజనాత్మకతతో తయారు చేసిన అలంకరణ సామాగ్రి, గృహోపకరణాలు, బుట్టలు, బొమ్మలు, గాజులు ఇలా ఆకర్షణీయమైన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. పొదుపు సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండటం, తక్కువ ధరకే వస్తుండటంతో ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. మార్చి 8న మహిళాదినోత్సవం రోజున ఒకే రోజు కోటి రూపాయల విలువైన వస్తువులు అమ్మేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
"డ్వాక్రా సంఘాల మహిళలు వివిధ రకాల వస్తువులు తయారుచేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే మేళాలకు విశేష ఆదరణ వస్తోంది. ఒకేచోట మేళాలు నిర్వహిస్తే అక్కడే వస్తువులను కోనుగోలు చేస్తారు. అలా కాకుండా వీటిని ఆన్‌లైన్ ఉంచినట్లయితే దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ఈ కామర్స్ సంస్థలైన రెండు యాప్‌లతో అనుసంధానమయ్యాం. అందులో మా ఉత్పత్తులన్నీ ఉంటాయి. మార్చి 8న రూ.కోటి విలువైన వస్తువులు అమ్మేలా ప్రణాళికలు రూపొందించాం." - భరత్, మెప్మా డైరెక్టర్
ఆన్‌లైన్ ద్వారా ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నింటినీ లెక్కించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. స్వయం సహాయక బృందాల మహిళలు ఒకే రోజు కోటి రూపాయలు విలువ చేసే వస్తువులను అమ్మిన ఘనత ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ రికార్డును మెప్మా ద్వారా ఏపీలో నెలకొల్పాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిపి రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు మార్చి 8న రాష్ట్రానికి వచ్చి స్వయంగా పరిశీలించేందుకు అంగీకరించినట్లు మెప్మా డైరెక్టర్ తెలిపారు.
ధర తక్కువ-నాణ్యత ఎక్కువ - 'మై స్టోర్' యాప్‌లో డ్వాక్రా ఉత్పత్తులు
డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ - తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు