Payment of Rs 61 Crore to Rushikonda Palace Contractor: రాష్ట్రంలో వివిధ పనులు చేసి బిల్లులు కోసం ఎదురుచూస్తున్న గుత్తేదారులను కాదని, రుషికొండలో జగన్ కోసం మాయామహల్ నిర్మించిన సంస్థకు మాత్రం చెల్లింపులు చేయడం చర్చనీయాంశమవుతోంది. జీతాలు, అత్యవసర బిల్లులు మాత్రమే చెల్లించాలని ఆర్థికశాఖ ఆదేశాలు సైతం లెక్కచేయకుండా చెల్లింపుల చేయడం విశేషం.
జగన్ జమానాలో కీలకంగా వ్యవహరించిన గుత్తేదారు సంస్థ: రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చిన్న చిన్న బిల్లుల కోసమే గుత్తేదారులు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అధికారులు సీఎఫ్ఎంఎస్ (Comprehensive Financial Management System) తలుపులు మూసివేశారు. జీతాలు, అత్యవసర చెల్లింపులు మాత్రమే చేయాలని ఆర్థికశాఖ ఖజానా అధికారులకు ఆదేశాలిచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ జగన్ జమానాలో కీలకంగా వ్యవహరించిన ఓ గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కోటి లోపు బిల్లుల కోసం ఇతర గుత్తేదారుల ఎదురుచూపులు: రుషికొండలో ప్యాలెస్ నిర్మాణంలో సింహభాగం చేజిక్కించుకున్న డెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్సు ఇండియా సంస్థకు 60.96 కోట్ల బిల్లులు చెల్లించారు. విశాఖలోని క్లస్ట వర్సిటీ పనులు, పులివెందులలోని వైద్య కళాశాలకు సంబంధించిన ఈ బిల్లులు చెల్లించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా గుత్తేదారులు బిల్లుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కోటి విలువ కన్నా తక్కువ చెల్లింపులను సైతం అందక విలవిల్లాడుతుంటే, జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఓ బడా గుత్తేదారు సంస్థ బిల్లులు చేజిక్కించుకోవడం విశేషం.
అధికారుల తీరును తప్పుబట్టిన హైకోర్టు: రాష్ట్ర హైకోర్టు సైతం ఇటీవల బిల్లుల చెల్లింపుల్లో వివక్షపై ఆర్థికశాఖ అధికారుల తీరును తప్పుబట్టింది. కొన్ని పెద్దపెద్ద బిల్లులు చెల్లిస్తున్నా చిన్న బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపుల్లో ఏలాంటి విధానాలు పాటిస్తున్నారు. కొన్ని బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యమివ్వడానికి కారణాలేంటి, వాటికి ఉన్న మార్గదర్శకాలు ఏంటో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది
కమోడ్ రూ.11లక్షలు - ఆ బాత్రూం ఖర్చుతో విశాఖలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనొచ్చు!