CS Vijayanand review on Vegetables Prices: రాష్ట్రంలో పచ్చిమిరప, ఎండు మిరప పంటలు సహా వంగ, టమాటా తదితర కూరగాయలు ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ కె. విజయానంద్ చెప్పారు. కూరగాయలు, ఇతర పంటల ధరలపై క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెట్లో రైతులకు అందుతున్న ధరల వివరాల గురించి అధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు కనీస ధర వచ్చేలా చూడడంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ధరల హెచ్చు తగ్గులను పర్యవేక్షిస్తూ రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు లేని రీతిలో ధరలు ఉండేలా చూడాలని సీఎస్ అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద అధికంగా పంటలు పండిన ప్రాంతాల్లో ధరలు పడిపోవడం, సరఫరా లేని చోట్ల ధరలు అధికంగా పెరగడం లాంటి పరిస్థితులు ఉంటున్నాయని వాటిని రైతు బజార్లకు తరలించటం ద్వారా ధరలను స్థిరీకరించాలని అన్నారు. అగ్రివాచ్‌తో పాటు రియల్‌టైమ్ గవర్నెన్స్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు కూరగాయల ధరలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
గిరిజనుల చట్టాలను కాపాడుతాం - వెనకబాటుతనం తగ్గిస్తాం: సీఎం చంద్రబాబు
పంటకు కనీస మద్దతు ధర రాని పరిస్థితులు నెలకొన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వపరంగా ధరల స్థిరీకరణ కింద రైతులను ఆదుకోవడంతోపాటు వినియోగ దారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో యూకలిప్టస్, సుబాబుల్ పండించే రైతులకు కనీస మద్ధత్తు ధర వచ్చేలా ఐటీసీ తదితర సంస్థలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం సుబాబుల్ టన్నుకు రూ.5,400, యూకలిప్టస్ టన్నుకు రూ.4,400 వరకూ కనీస మద్ధత్తు ధర లభిస్తోందని అధికారులు సీఎస్‌కు వివరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. కూరగాయలు, పండ్లు పాడవకుండా తాజాగా ఉంచడంతో పాటు మిగిలిన వాటిని తర్వాత విక్రయించుకునేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. త్వరలోనే 59 సబ్జీ కూలర్లను రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు సీఎస్‌కు వివరించారు.
అమరావతిలో రూ.2,903 కోట్లతో పనులు - టెండర్లు ఆహ్వానించిన ఏడీసీఎల్