Singer Mangli Responds to Political Allegations: దేవుడి కార్యక్రమానికి వెళ్తే, తనపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని గాయని మంగ్లీ అన్నారు. ఇటీవల ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లారు. దీనిపై టీడీపీ క్యాడర్‌తో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో మంగ్లి బహిరంగ లేఖ రాశారు. తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో తనకు సంబంధం లేదని మంగ్లీ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం తనపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ మంగ్లీ చంద్రబాబు కోసం పాట పాడను అన్నది అవాస్తమని తెలిపారు. దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని ప్రచారం చేయడం న్యాయమేనా అని మంగ్లీ ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడానని అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరిని ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు.

ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు: సీఎం చంద్రబాబు
నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను: వైఎస్సార్పీపీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు మంగ్లీ లేఖలో పేర్కొన్నారు. తన పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలి కానీ పార్టీల పాట కాకూడదని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీలకు పాటలు పాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో తనపై విష ప్రచారం చేస్తున్నారని మంగ్లీ వాపోయారు. తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవని తాను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానని మంగ్లీ వివరించారు.
ఒక కళాకారిణిగా తనకు తన పాటే అన్నింటికన్నా ముఖ్యమని మంగ్లీ వెల్లడించారు. శ్రీకాకుళం అరసవల్లి రథసప్తమి వేడుకల్లో మ్యూజిక్ ఈవెంట్ చేయడం ఎంతో అదృష్టంగా భావించానని అది విజయవంతం కావడంతో ఒక అడబిడ్డగా తనను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు గౌరవించి ఆశీర్వదించడం ఎలా తప్పు అవుతుందని మంగ్లీ ప్రశ్నించారు. దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనుల చట్టాలను కాపాడుతాం - వెనకబాటుతనం తగ్గిస్తాం: సీఎం చంద్రబాబు