Photo Shoot Studios in AP : గుడిలో ప్రార్థన, బడిలో చదువు, సంగీత కళాశాలలో సుస్వరాలు, ఉద్యానంలో విహారం, స్నేహితులతో ఆటలు ఇలా ఏదైనా ఫొటో ఫోజు కోసం పదిచోట్లకు పరుగులు తీయక్కర్లేదు. ఒకేచోట కోరిన రీతిన చిత్రాలు, వీడియోలు తీసుకోవచ్చు. పెళ్లికి ముందు, వివాహం తర్వాత, బర్త్‌డే ఇలా వేడుక ఏదైనా ఫొటోషూట్ కోసం లొకేషన్స్ కోసం వెతుక్కునే రోజులు పోయాయి. వీటి కోసం ప్రత్యేక స్టూడియోలు ఏపీలో వెలిశాయి. వేడుక ఏదైనా వేదిక మాది అంటూ ఉమ్మడి గోదావరి జిల్లాలు ఆహ్వానిస్తున్నాయి.
పంతులుగారు బాజాభజంత్రీలు వాయించండి అంటే వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాడని తెలియడం ఒకప్పటి ట్రెండ్. ఓ జంట చెట్టాపట్టాలేసుకుని కెమెరాకు ఫోజులిస్తే పెళ్లి చేసుకోబోతున్నారనేది నేటి ట్రెండ్. వివాహం నుంచి ఉద్యోగ విరమణ వేడుక దాకా ఏదైనా ప్రతి అనుభూతి పది కాలాలపాటు గుర్తుండేలా జిల్లావాసులు చూసుకుంటున్నారు. గోదారోళ్ల ఆసక్తికి తగ్గట్టుగానే ఉమ్మడి జిల్లాలో 12 వరకు స్టూడియోలు వెలిశాయి.
Photoshoot Trend : వీటిల్లో ప్రతిరోజు సుమారు 5 నుంచి 10 వరకు ఫొటో షూట్‌లు జరుగుతున్నాయి. కాకినాడ, రాజహేద్రవరం జిల్లాల్లోనే 10 వరకు ఉన్నాయి. చిన్న పిల్లలకు ఫొటోలు తీసుకునే స్టూడియోలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ పాతకాలం నాటి స్కూటర్లు, అర్ధచంద్రాకారంలోని చందమామ, కార్లు, బొమ్మలతో కూడిన స్టూడియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలంకరణ వస్తువులు, డ్రెస్‌లు అద్దెకిచ్చే దుకాణాలు ఉమ్మడి జిల్లాలో నగరాలు, పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి. స్టూడియోలో ఉండే సెట్‌కు సరిపడా గెటప్ కూడా అద్దెకు లభిస్తున్నాయి.
ఓ జంట నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయబద్ధంగా ఫొటోషూట్ చేయాలనుకుంటే అందుకు కావాల్సిన నగలు, పట్టుచీరలు, చేతిలో పూజా సామగ్రి బుట్ట ఇలా అన్నీ లభిస్తున్నాయి.సెట్‌కు సరిపడా గెటప్ వేయాలంటే బ్యూటీషియన్లు, మేకప్ ఆర్టిస్టులు కూడా ఫోన్ చేస్తే ఈ స్టూడియోలకు వచ్చి వాలిపోతున్నారు. దీనిని బట్టి నగదు తీసుకుంటున్నారు. చిత్రాలు తీసేందుకు కావాల్సిన ఖరీదైన కెమెరాలు సైతం అందుబాటులో ఉంటున్నాయి.
చిరు జల్లులు, పొగమంచు : కొన్ని స్టూడియోల్లో ఫొటోషూట్‌లతోపాటు లఘు చిత్రాలు, చిన్న పాటలు తీసుకునే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇందుకు గంటకు లేదా రోజు చొప్పున అద్దెకిస్తున్నాయి. పెద్ద స్టూడియోలో సాధారణంగా 4 గంటలు తప్పనిసరిగా అద్దెకు తీసుకోవాలి. ఆ తర్వాత గంట చొప్పున అద్దె వసూలు చేస్తారు. వినియోగదారుడి కోరిక మేరకు రాత్రిపూట వీధి దీపాల వెలుగులు, పొగమంచు, చిరు జల్లులు కురుస్తున్నట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.