Minister Lokesh Participated in Closing ceremony of Temple Expo : ‘మన సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు కీలకం. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చే పద్ధతిని పక్కనపెట్టి పురాణాలు, ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలి. తొమ్మిదేళ్ల మా అబ్బాయి దేవాంశ్‌కు అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నా. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ కంటే మన హనుమాన్ శక్తిమంతుడు అని చిన్నారులకు చెప్పాలి. హ్యారీపోటర్ కథల కంటే మన పురాణేతిహాసాలు ఇంకా బాగుంటాయని వివరించాలి. ఎవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ అమెరికా, సినిమాల కంటే మన శ్రీకృష్ణుడి లీలలు, శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పాలి’ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
తిరుపతిలో ‘టెంపుల్ మహాకుంభ్’ పేరుతో ‘టెంపుల్ కనెక్ట్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీˆఎక్స్)-2025లో బుధవారం ముగిసింది. ముగింపు సదస్సులో లోకేశ్ మాట్లాడారు. ‘ఆలయాల పాలనా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శం. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల సేవలన్నీ వాట్సప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాం. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సేవలు కూడా వాట్సప్ వేదికగా తీసుకొస్తాం.
తిరుమల సహా రాష్ట్రంలోని ఆలయాల్లో భారీ క్యూ లైన్లు లేకుండా, భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా చర్యలు తీసుకుంటాం. ఏఐ, డ్రోన్ వంటి సాంకేతికతను ఉపయోగించి రద్దీ నిర్వహణ, నియంత్రణ చేస్తాం. ఇదే సమయంలో సంప్రదాయాలనూ కాపాడతాం. ఆధ్యాత్మిక, ఆలయాల పర్యాటకంలో ఏపీ అగ్రగామిగా ఉంది. ప్రధాన ఆలయాల్లో వైదిక సంప్రదాయాలను నిలబెట్టేందుకు వైదిక కమిటీలు ఏర్పాటు చేశాం. 73 దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు రూ.134 కోట్లు మంజూరు చేశాం.
విధాన రూపకర్తలు, నిపుణులు, ఆలయాల నిర్వాహకులను ఐటీసీఎక్స్ ఒకచోటకు చేర్చింది. ఐటీసీఎక్స్ చొరవ తీసుకుని దేవాదాయ శాఖ మంత్రుల సదస్సు నిర్వహిస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇందుకు తొలి వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని లోకేశ్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో లక్ష దేవాలయాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని ఐటీసీఎక్స్ నిర్వాహకులు ముగింపు సందర్భంగా వెల్లడించారు. సనాతన బోర్డును సమర్థిస్తున్నామని సమాధానమిచ్చారు.
"వాట్సప్ గవర్నెస్ ద్వారా ఆలయాల్లోకి ప్రవేశం కల్పించడం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో మైలురాయి. ఆలయాలను భక్తులకు మరింత చేరువ చేయడంలో ఇది కీలక ముందడుగు. ప్రస్తుతానికి ముఖ్యమైన ఏడు ఆలయాల సేవలు వాట్సప్‌తో అనుసంధానించాం. మరో మూడు నెలల్లో టీటీడీ సేవలు సైతం అందుబాటులోకి తెస్తాం. స్వామివారి దర్శనానికి పెద్దపెద్ద క్యూలైన్లలో భక్తులు వేచి ఉండకుండా టిక్కెట్లు, సేవలు మరింత సరళీతరం కానున్నాయి." - నారా లోకేశ్, మంత్రి
ఆలయాల నిర్వహణకు చట్టాన్ని జోడించాలి: దేశంలో ఆలయాలు, ప్రార్థన మందిరాల పాలన, నిర్వహణ వంటి అంశాల్లో తలెత్తే ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి చట్టం, రాజ్యాంగ దృక్పథాన్ని జోడించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సూచించారు. ‘మతపరమైన హక్కులు, ఆలయాల నిర్వహణ, రాజ్యాంగం, చట్ట పరిధి’ అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ‘దేశంలో మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ అది సంపూర్ణమైనది కాదు.
ఇతర రాజ్యాంగ హక్కులు, ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి స్వేచ్ఛ కల్పిస్తోంది. మెరుగైన పాలన కోసం రాష్ట్రం ఆలయాలను నియంత్రించవచ్చు. ఉత్సవాలు, ఊరేగింపులు, సంగీతం, బాణసంచా కాల్చడం ద్వారా ఏర్పడే శబ్దకాలుష్యాన్ని పరిమితం కూడా చేయవచ్చు. బలవంతపు మతమార్పిళ్లను నిషేధించవచ్చు’ అని చెప్పారు. కార్యక్రమంలో అంత్యోదయ ప్రతిష్ఠాన్, ఐటీసీˆఎక్స్ ఛైర్మన్ ప్రసాద్‌లాడ్, వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో నారా లోకేశ్ ఫ్యామిలీ
వాట్సప్ గవర్నెన్స్‌లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతి: లోకేశ్