Maha Shivaratri Lingodbhava Time in Telugu : మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ ఇలా చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ క్రమంలో లింగోద్భవ సమయం ఎప్పుడు ఉందో తెలుసుకుందాం.
మహాశివరాత్రి రోజు రాత్రి 11.30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1.00 గంట మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని 'లింగోద్భవ కాలం' అనే పేరుతో పిలుస్తారు. ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి. ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.
- లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవుపాలతో అభిషేకం చేసి, పద్మ పుష్పాలతో పూజ చేయాలి. పులగం నైవేద్యంగా సమర్పించాలి.
- లింగోద్భవ కాలంలో రెండవ భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలి. అలాగే పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
- లింగోద్భవ కాలంలో మూడవ భాగంలో శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజించాలి. అనంతరం పరమశివుడికి నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
- లింగోద్భవ కాలంలో నాలుగవ భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ, తుమ్మి పూలతో పూజించాలి. అనంతరం పరమశివుడికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
దీపం వెలిగించండి :
మహా శివరాత్రి రోజు ఎవరైన సరే ఎర్రటి కొత్త ప్రమిదలో దీపం వెలిగించి 'దారిద్ర దహన శివ' స్తోత్రాన్ని చదివితే మహా పుణ్యం కలుగుతుంది. శివరాత్రి రోజు ఉదయం లేదా సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. దీనివల్ల శివానుగ్రహంతో జన్మజన్మల దరిద్రం తొలగిపోతుందని మాచిరాజు తెలిపారు.
శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగం లాగా తయారు చేయాలి. ఆ శివలింగానికి పుష్పాలతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఆపై దానిని పారే నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని మాచిరాజు చెప్పారు. ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయని అంటున్నారు.
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నారా? - అవకాశం లేని వాళ్లు ఈ మంత్రం పఠిస్తే సరిపోతుందట
ప్రత్యేక తాంబూలం :
శివరాత్రి రోజు ఒక తాంబూలం సమర్పించడం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. అది ఏంటంటే 'పంచ సౌగంధిక' తాంబూలం. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలను పంచ సౌగంధికాలుగా చెబుతారు. రెండు తమలపాకుల్లో వీటిని ఉంచి రెండు వక్కలు, రెండు అరటి పండ్లను శివుడి ఫొటో దగ్గర పెట్టి నమస్కరించాలి. అనంతరం ఆ తాంబూలం ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మలపాటు శివానుగ్రహం కలుగుతుంది.
ఇలా మహా శివరాత్రి సందర్భంగా రాత్రిపూట లింగోద్భవ సమయాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని పూజించడం వల్ల పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మాచిరాజు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
'శివరాత్రి రోజు ఇలా చేస్తే సొంతింటి కల నెరవేరుతుందట! - జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారంటే'
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?