Oil Free Vada Recipe : మనలో చాలా మందికి వేడివేడి వడలంటే చాలా ఇష్టం. ఉదయాన్నే రెండు ఇడ్లీ, వడ తింటే చాలు మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు! పిల్లలు కూడా వడలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసేవారు, ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడని వారు వీటికి దూరంగా ఉంటారు. అలాంటి వారికోసం చుక్క నూనె లేకుండా తయారు చేసే వడలను తీసుకొచ్చాం. ఈ స్టోరీలో చెప్పినట్లు చేస్తే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అయిన ఆయిల్ ఫ్రీ వడ మీ ముందుంటుంది. వీటిని సాయంత్రం టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి సింపుల్‌గా ఆయిల్ ఫ్రీ వడలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- అటుకులు - కప్పు
- ఉప్మా రవ్వ - అరకప్పు
- పెరుగు - అరకప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి -4
- కరివేపాకు -2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. అలాగే కరివేపాకు ముక్కలుగా చేసుకోండి.
- తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో అటుకులు తీసుకోండి. వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకోండి.
- ఆపై ఓ 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన అటుకులు, పెరుగు, ఉప్మా రవ్వ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయండి.
- తర్వాత ఉప్పు, జీలకర్ర వేసి పిండి బాగా కలపండి.
- వడల పిండి గట్టిగా మారిన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని వడలా చేసుకోండి. దీనిని ఇడ్లీ పాత్రలో పెట్టండి.
- ఇలా పిండిని వడలుగా చేసుకుని అన్నింటినీ ఇడ్లీ పాత్రలలో పేర్చుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసుల నీళ్లను పోయండి. ఆపై నీరు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టండి.
- ఇడ్లీ పాత్రపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. ఓ 5 నిమిషాల తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఈ పద్ధతిలో చేస్తే చుక్క నూనె లేకుండానే హెల్దీ వడలను రెడీ చేసుకోవచ్చు. ఆవిరిలో ఉడికిన ఈ వడలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.
- బరువు తగ్గడం కోసం ప్రయత్నం చేస్తున్నవారూ వీటిని తినచ్చు.
- ఈ వడలు పల్లీ చట్నీ, సాంబార్‌తో ఎంతో రుచికరంగా ఉంటాయి.
- చుక్క నూనె లేని ఈ వడలు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి.
వేసవిలో ఇంట్లోనే తయారు చేసుకునే హెల్త్ డ్రింక్స్ - టీ, కాఫీ బదులు ఇవి ట్రై చేయండి
నోరూరించే 'క్యారెట్ పచ్చడి' - పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు!